నేడు యువగళం బహిరంగ సభ

Dec 19,2023 21:49

ప్రజాశక్తి- భోగాపురం  :   టిడిపి యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం-నవశకం పాదయాత్ర విజయోత్సవ సభ భోగాపురం మండలం పోలిపల్లి వద్ద గల భూమాతా లేఅవుట్‌లో బుధవారం జరగనుంది. ఈ సభకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సహా టిడిపి కీలక నేతలు, అన్ని నియోజక వర్గాలకు చెందిన పార్టీ ఇన్‌ఛార్జులు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. గత వారం రోజులుగా సభా వేదిక, బారీకేడ్లు ఏర్పాటు చకా చకా జరిగాయి. గత రెండురోజులుగా టిడిపి ముఖ్య నాయకులంతా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. రాష్ట్రంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, జనసేనకు చెందిన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మంగళవారం సభా వేదిక వద్దకు వచ్చారు. నారా లోకేష్‌, ఆయన సతీమణి బ్రాహ్మిణి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇప్పటికే చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు, బుచ్చయ్య చౌదరి, అలాగే నాయకులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, పట్టాభి, బుద్దా వెంకన్న, చింతకాయల అయ్యన్న పాత్రుడు, పీతల సుజాత, దేవినేని ఉమా, కొల్లి రవీంద్ర, ఉగ్రనరసింహారెడ్డి, వర్ల రామయ్య, బాబు రాజేంద్రప్రసాద్‌ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఇంటికి వెళ్ళేందుకు సిద్దంగా ఉందని, మరో వంద రోజుల్లో టిడిపి అధికారంలోకి రానుందని అన్నారు. యువగళం సభ నిర్వహించేందుకు వైసిపి ప్రభుత్వం అన్ని విధాలా ఆటంకాలు కలిగించిం దన్నారు. సభా స్థలంతో పాటు, బస్సులు ఇచ్చేందుకు కూడా నిరాకరించిందని తెలిపారు. వైసిపిని ప్రజలు ఇంటికి సాగనంపేందుకు సిద్దమయ్యా రని అన్నారు. అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం నడవడం లేదని అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ కూడా హాజరవుతుండడంతో ఆ పార్టీకి చెందిన నాయకులు పంచకర్ల సందీప్‌, కోన తాతారావు, పాలవలస యశస్వని, పడాల అరుణ, లోకం మాధవి తదితరులు సభా ప్రాంగణం వద్దకు వచ్చిఏర్పాట్లను పరిశీలిం చారు. సభకు 5లక్షల మంది వస్తారని అంచనా కాగా, సుమారు లక్షమందికి కూర్చోనేందుకు కుర్చీలు వేస్తున్నారు. ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా పార్కింగ్‌ ఏరియాలను కూడా జిల్లాల వారీగా ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులతో సన్‌ రే రిసార్ట్‌కు చేరుకున్న లోకేష్‌ కుటుంబ సభ్యులతో కలిసి నారా లోకేష్‌ సన్‌ రే రిసార్ట్‌ కు శనివారం రాత్రి చేరుకున్నారు. విశాఖలో మంగళవారంరాత్రి యువగలం పాదయాత్ర ముగిసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి చేరుకున్నారు. బుధవారం జరిగే ముగింపు సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ ఆయనను కలిసి సాలువ కప్పి సన్మానించారు

➡️