నోటీసులకు సమాధానంగా లేఖలు

Jan 20,2024 00:41

మంగళగిరిలో కార్యాలయం ఎదుట లేఖలతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి-గుంటూరు :
వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీల నిరవధిక సమ్మె 39వ రోజుకు చేరుకుంది. శుక్రవారం స్థానిక నల్లపాడు రోడ్డులోని సిడిపిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. అనంతరం అంగన్‌వాడీలకు ఇచ్చిన షోకాజు నోటీసులకు సామూహికంగా అధికారులకు సమాధానం ఇచ్చారు. తొలుత చుట్టుగుంట సెంటర్‌ నుండి సిడిపిఒ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి పి.దీప్తి మనోజ మాట్లాడుతూ షోకాజు నోటీసులను యూనియన్‌గా ఐక్యంగానే ఎదుర్కొంటామని చెప్పారు. సమ్మె చట్టబద్ధంగా చేస్తున్నామని, ప్రభుత్వం షోకాజు నోటీసులు ఇవ్వటం సరికాదని అన్నారు. దీనిపై అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. ప్రభుత్వం అంగన్‌వాడీల ఐక్యతను దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నగర తూర్పు, పశ్చిమ ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస రావు, బి.ముత్యాలరావు, అంగన్‌వాడీ యూనియన్‌ నగర అధ్యక్ష, కార్యదర్శులు చిన్న వెంకాయమ్మ, టి.రాధ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మంగళగిరి : అధికారులు జారీ చేసిన షాకాజ్‌ నోటీసులకు ప్రతిగా అంతన్వాడీలు లేఖలతో సమాధానమిచ్చారు. ఈ మేరకు వ్యక్తిగత లేఖలను తీసుకుని ప్రదర్శనగా వెళ్లి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు సామూహికంగా అందజేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారం 39వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో అంగన్వాడీలు స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లోని సమ్మె శిబిరం నుండి ఐడిసిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వరకూ ప్రదర్శన చేశారు. కార్యాలయం ఎదుట కొద్దిసేపు నిరసన అనంతరం ఐసిడిఎస్‌ అధికారులు ఇటీవల జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు సమాధానంగా లేఖలను ఇచ్చారు. షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొన్న అంశాలతో తాము ఏకీభవించ బోమని లేఖలో పేర్కొన్నారు. దీనిపై అవసరమైతే వ్యక్తిగతంగా సమాధానం ఇచ్చుకుంటామన్నారు. చట్ట ప్రకారమే సమ్మె చేస్తున్నామని తెలపడంతోపాటు అందుకు దారితీసిన పరిస్థితులను అధికా రులకు వివరించి లేఖలను అందించారు.ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే సమ్మెలో ఉన్న అంగన్వా డీలు మూడ్రోజులుగా విజయవాడలో నిరవధిక దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దళితులు, మహిళలు ఆత్మాభిమానంతో జీవనం సాగించాలని రాజ్యాంగంలో అంబేద్కర్‌ రాశారని, దీన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు. యూని యన్‌ ప్రాజెక్ట్‌ గౌరవాధ్యక్షులు వి.దుర్గారావు మాట్లాడుతూ అంగన్వాడీల ఆగ్రహానికి గురైతే ప్రభుత్వాలే మారిపోతాయని హెచ్చరించారు. సిఐటి యు సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలనే ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. తొలుత అంబేద్కర్‌ సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహానికి రమాదేవి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐటి యు నాయకులు వై.కమలాకర్‌, డి.వెంకట రెడ్డి, బి.వెంకటేశ్వర్లు, కరుణాకర్‌రావు, జె.బాలరాజు, యూనియన్‌ నాయకులు హేమలత, రుక్మిణి, తబిత, ఫాతిమా, జయ, సరస్వతి, రైతు సంఘం నాయకులు ఎం.ఫకీరయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.బాలాజీ, కె.ఉజ్వల్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : స్థానిక విఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్విఆర్‌ కళాశాల ఎదురు విజయవాడ తెనాలి రహదారి పక్కన సమ్మె శిబిరం కొనసాగింది. ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట లేఖలతో అంగన్వాడీలు ధర్నా చేసి సిడిపిఒ డాక్టర్‌ ఎం.సునీతకు వాటిని అందించారు. యూనియన్‌ జిల్లా నాయకులు ఎవిఎన్‌ కుమారి మాట్లాడారు. ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని, తమపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. వీరికి మద్దతుగా సిపిఎం మండల కార్యదర్శి కె.బాబూప్రసాద్‌ మాట్లాడారు. సిఐటియు నాయకులు షేక్‌ హుస్సేన్‌వలి, అంగన్వాడీ నాయకులు పి.పావని, జయ లక్ష్మి, సీత, రంగపుష్ప, అనురాధ, హసీనా బేగం, నాగమణి, శాంతకుమారి, జానకి, రాధిక, స్వప్న, హేమలత, అంజనీ, జ్యోతి, విజయలక్ష్మి, రాధాకుమారి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – ప్రత్తిపాడు : ప్రత్తిపాడు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలంతా ప్రత్తిపాడులోని బస్టాండ్‌ సెంటర్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడి నుండి సిడిపిఒ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు. కార్యాలయం ఎదుట ధర్నా చేసి సిడిపిఒ సుజాతదేవికి లేఖలు అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వం రకరకాల పద్ధతిలో బెదిరించి చివరిగా ఉద్యోగాలు తీసేస్తామని భయబ్రాంతులకు గురిచేయడం మానుకోవాలన్నారు. హక్కులను పోరాటం ద్వారానే సాధించుకోవాలని అంబేద్కర్‌ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగానే అంగన్వాడీలు పోరాడుతున్నారనే విషయాన్ని సిఎం గుర్తించాలన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత బెదిరించినా అంగన్వాడీలు వెనక్కు తగ్గబోరని, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ బాటలోనే తిప్పికొడతారని చెప్పారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ సమ్మె విరమించబోరని స్పష్టం చేశారు. సిఐటియు నాయకులు కె.శ్రీనివాసరావు, అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రేమలత, ఎ.పద్మ, నాయకులు నగరాజకుమారి, సుభాషిని, శ్రీదేవి, శివ పార్వతి, ధనలక్ష్మి, శ్రీవాసవి, శశికళ, నవరత్నమని, విజయ, అనురాధ పాల్గొన్నారు.

➡️