నోటీసులతో ఉద్యమాలు ఆపలేరు : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-మదనపల్లి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరు ద్ధరించాలని సిపిఎస్‌ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన విజయవాడలో జరగబోవు ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ ధర్నా కార్యక్రమానికి వెళ్లకూడదంటూ యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పురం వెంకటరమణకు పాఠశాలకు వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటీసులతో ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు. ఇది అప్రజాస్వామికమని తెలిపారు. నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిపిఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలంటూ జరిగే కార్యక్రమాలను ప్రభుత్వం నిరంకుశంగా అడ్డుకుంటున్నదని ఇది సరైన పద్ధతి కాదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి నిర్బంధాల ద్వారా ఉద్యమాలను అణచాలనుకోవడం అవివేకమని తాను ఇచ్చిన మాటకు కట్టుబడి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో ఏ పార్టీ అయితే పాత పెన్షన్‌ పునరుద్ధరిస్తామని హామీ ఇస్తుందో వారికే పది లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు రాబోయే ఎన్నికల్లో మద్దతు తెలుపుతారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో సిపిఎస్‌ రద్దు అంశాన్ని చేర్చాలని కోరారు. ఈ ధర్నాకు వెళ్లవద్దంటూ జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు.

➡️