పంచ గ్రామాల సమస్యపై ధర్నా

 ప్రజాశక్తి-సింహాచలం: 24 సంవత్సరాల నుంచి సాగుతున్న పంచ గ్రామాల భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన సింహాచలం ప్రధాన కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రాస్తారకో జరిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ మాట్లాడుతూ, ఈ సమస్య పరిష్కారానికి కేబినెట్లో ఆమోదం తెలిపి, గత ప్రభుత్వం మాదిరిగా ఆదరాబాదరాగా జిఒను తెచ్చి తర్వాత సమస్యను పక్కదారి పట్టించారని విమర్శించారు. ఈ సమస్య వల్ల సుమారు లక్ష మంది జనాభా బాధపడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించుకుంటే రానున్న ఎన్నికల్లో బాధితులు తరపున ఒక అభ్యర్థిని పోటీలో నిలుపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జివిఎంసి 72వ వార్డు సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, ఈ సమస్యపై జివిఎంసి కౌన్సిల్లో తీర్మానం ప్రవేశపెడితే మేయర్‌ దీన్ని తిరస్కరించడం శోచ నీయమన్నారు. దీన్ని చూస్తే ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా మేనేజ్‌ చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. వెంటనే రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టీవీ.కృష్ణంరాజు, సిహెచ్‌ఎస్‌ గోపాలకృష్ణ, ఎబిఎన్‌.ప్రతాప్‌, సిపిఎం గోపాలపట్నం జోన్‌ కార్యదర్శి బి.వెంకటరావు, సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం సభ్యులు పి.రామారావు, సిహెచ్‌ కోటేశ్వరరావు, ఎస్‌వి.రమణ, ఎం.రామభద్రరావు, నాగేశ్వరరావు, వి.నారాయణరావు, కృష్ణారావు, బి.శంకరరావు, శ్రీనివాసరావు, శ్రీహరి, కాలనీ సంఘాల పెద్దలు, బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

➡️