పంటనష్టం వెయ్యి ఎకరాలే!

Dec 18,2023 20:42

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ల మాదిరిగా మూడేనంటూ రెండు వేళ్లను చూపుతూ ఒక వేలిని మూసేశాడంట వెనుకటి ఓ వ్యక్తి. జిల్లాలో మిచౌంగ్‌ తుపాను కారణంగా పంట నష్టాల గణనలో వ్యవసాయ, రెవెన్యూ శాఖల లెక్కలు కూడా అచ్చంగా అలానే ఉన్నాయి. ఈనెల 4 నుంచి నుంచి 6వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో వివిధ పంటనష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది ఎకరాల్లో రైతులు పంటనష్టం చవి చూసినప్పటికీ ప్రభుత్వ నిబంధనల కారణంగా కేవలం 1,054 ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగినట్టు గుర్తించారు. దీంతో, చాలా మంది రైతుల పంటనష్టాలు గుర్తింపునకు నోచుకోలేదు. విజయనగరం జిల్లాలో 2.40లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా 1.60లక్షల ఎకరాల్లో తుపాను ముందు రోజునాటికి కోతలు పూర్తయ్యాయి. ఇందులో దాదాపు లక్ష ఎకరాల్లో వరి చేను పొలాల్లోనే ఉండిపోయింది. ముంపునకు గురికావడంతో తీవ్ర నష్టం జరిగింది. అధికారులు మాత్రం కేవలం 2,790.45 ఎకరాల్లోనే పంట నీటమునిగిపోయిందని ప్రాథమిక అంచనాలు తేల్చారు. పంట నష్టం 33శాతం దాటితేనే గుర్తించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో కేవలం 21 మండలాల్లో 1,054 ఎకరాల్లో మాత్రమే ముంపునష్టం ఏర్పడినట్టు గుర్తించారు. ఇందులో అత్యధికంగా పూసపాటిరేగ మండలంలో 102.50 ఎకరాలు, డెంకాడలో 72.40 ఎకరాలు, ఎస్‌.కోటలో 44.50ఎకరాలు, ఎల్‌.కోట, 25 పంట నష్టం గురైనట్టు స్పష్టం చేశారు. వేపాడ, సంతకవిటి, రేగిడి, మెరకముడిదాం, రాజాం, వంగర మండలాల్లో ఒక్క ఎకరా కూడా పంటనష్టం వాటిల్లలేదని తేల్చారు. ప్రస్తుతం అధికారులు తయారు చేసిన పంటనష్టం, వాటికి సంబంధించిన రైతుల పేర్ల జాబితాను సామాజిక ఆడిట్‌ కోసం ఆర్‌బికెల్లో ప్రదర్శనకు పెట్టనున్నారు. 22వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. వీటన్నింటినీ పరిష్కరించి 26వ తేదీ నాటికి ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం కలెక్టర్‌ ఆధ్వర్యాన ప్రభుత్వానికి పంపాల్సి వుంటుంది. వీటిని పంపడానికి ముందు విస్తీర్ణం, జరిగిన నష్టం, ఇ-క్రాప్‌ నమోదు తదితర అంశాలను పున:పరిశీలించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

➡️