పంట కాలువ పూడికతీత పనులు

Dec 28,2023 22:56
రాజమహేంద్రవరం రూరల్‌

ప్రజాశక్తి – కడియం

రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ వైసిపి కో-ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ ఆర్థిక సాయంతో రైతుల భాగస్వామ్యంతో పంట కాలువలో పూడిక తీత పనులు ప్రారంభం అయ్యాయి. రబీలో సాగు చేసేందుకు నీటి కొరత వెంటాడుతున్న తరుణంలో మండలంలోని పంట కాలువలో పెరిగి పోయిన తూటు, గడ్డి, వివిధ రకాల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించాలని రైతులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారి నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో మండలంలోని మురముండ గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు, రైతు అయినవిల్లి వెంకటేశ్వర్లు రైతుల సమస్యను చందన నాగేశ్వర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి రైతుల భాగస్వామ్యంతోపాటు, అందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించేందుకు అంగీకరించడంతో గురువారం మండలంలోని జేగురుపాడు గ్రామంలోని పంట కాలువలో పూడిక తీత పనులను ప్రారంభించారు. జేగురుపాడు, మాధవరాయుడుపాలెం, మురమండ, ఏడిదసీతానగరం గ్రామాలకు సంబందించిన సుమారు 1700 ఎకరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి తీరే అవకాశం వచ్చిందని, అందుకు సహకరించిన చందన నాగేశ్వర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

➡️