పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

విద్యార్థులతో మాట్లాడుతున్న ఇంటర్‌ బోర్డు అధికారి అప్పలరాము

ప్రజాశక్తి -సీలేరు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని ఇంటర్మీడియట్‌ బోర్టు డిస్టిక్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ కె.అప్పలరాము వెల్లడించారు. మంగళవారం ఆయన జీకే వీధి మండలం సీలేరు ఇంటర్‌ పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పరీక్ష కేంద్రంలో ఫ్యాన్లు, లైట్లు, మంచినీరు, ఇతర ఏర్పాట్లపై కళాశాల ప్రిన్సిపాల్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఎ.సాయిరాంతో సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లోని ప్రతిరూమ్‌లోనూ రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమిషనర్‌ కార్యాలయానికి అనుసంధానం చేస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతుందా కమిషనర్‌ ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని వెల్లడించారు. జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా డుంబ్రిగూడ, అనంతగిరిలో పరీక్ష కేంద్రాలను మంజూరు చేశామని తెలిపారు. జిల్లాలో రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులు మొత్తం 1521 మంది పరీక్షలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది హాజరు 60 శాతానికి తక్కువ ఉన్నా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్షలకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రెండు ప్లేయింగ్‌ స్క్వాడ్‌, ఆరు సిట్టింగ్స్‌ స్క్వాడ్‌లు ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. అనంతరం సీలేరు జూనియర్‌ కళాశాల విద్యార్థులతో అప్పలరాము కాసేపు వారితో ముచ్చటించారు. ప్రతి విద్యార్థి అంకితభావంతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.పోలీసు స్టేషన్‌లో ఇంటర్‌ ప్రశ్నా పత్రాలుఇంటర్‌ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి సెట్‌ 1, సెట్‌ 3 పశ్నాపత్రాలు మంగళవారం సీలేరు రాగా, వాటిని పోలీస్‌ స్టేషన్లో భద్రపర్చినట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఏ.సాయిరాం తెలిపారు. సీలేర్‌ కేంద్రంలో 103 మంది ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు.

➡️