పకడ్బందీగా సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలు

Mar 28,2024 22:59

వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి – గుంటూరు :
సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, జూన్‌ నెలాఖరు వరకూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. తాగునీటి సరఫరాపై ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పబ్లిక్‌ హెల్త్‌, మున్సిపల్‌, ఇంజినీరింగ్‌, పంచాయతీరాజ్‌ అధికారులతో కల్టెరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. సమ్మర్‌ స్టోరేజి ట్యాంకులన్నిటినీ పూర్తిగా నీటితో నింపాలని, తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దష్టి సారించాలని చెప్పారు. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు ప్రతిరోజూ తాగునీటి సరఫరాను పరిశీలించాలన్నారు. సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితులను వారం ముందే గుర్తించి, నివారణకు సంబంధిత శాఖలకు సమాచారం అందించేలా పంచాయతీ, జిల్లా పరిషత్‌ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. తాగునీటి ఎద్దడిగల గ్రామాలకు ట్యాంకర్లు ద్వారా ప్రతిరోజూ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. బోర్‌వెల్స్‌ సహా ఇతర తాగునీటి వనరులకు అవసరమైన మరమ్మత్ములు నిర్వహించి అవన్నీ సమక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. నాగార్జున సాగర్‌ కుడి కాల్వ ద్వారా తాగునీటి చెరువులకు ఎప్రిల్‌ 8వ తేదీన నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున కెనాల్‌ చివర ఉన్న గ్రామాల చెరువులు పూర్తి స్థాయిలో నింపుకునేలా ఇరిగేషన్‌, ఎన్‌ఎస్‌ కెనాల్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, పంచాయతి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కెనాల్‌ ద్వారా వచ్చే నీటిని వథా కాకుండా సద్వినియోగం చేసుకోనేందుకు, పొలాల్లోకి నీరు వెళ్లకుండా అన్ని షెట్టర్లను ముందస్తుగా మూసివేయాలని చెప్పారు. నీరు అడ్డంకులు లేకుండా ప్రవహించేందుకు ఏప్రిల్‌ 5వ తేది నాటికి కెనాల్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థతో పాటు పొన్నూరు, తెనాలి మున్సిపాల్టీల్లో తాగునీటి సరఫరాపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ డిస్టిబ్యూషన్‌ లైన్లును పరిశీలించాలన్నారు. పైపులైన్లు లేని ప్రాంతాలకు, శివారు, ఎక్స్‌టెన్షన్‌ ఏరియాలకు ట్యాంకుల ద్వారా సక్రమంగా నీటిని సరఫరా చేయాలన్నారు. తాగునీటి పథకాల మోటర్లకు విద్యుత్‌ అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ విద్యుత్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యమ్నాయ మార్గాలను ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ సురేష్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఇ ఉమామహేశ్వరరావు, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ ఎస్‌ఇ శ్రీనివాస్‌, భూగర్భజలవనరు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వందనం, సీపీడీసీఎల్‌ ఎస్‌ఇ మురళీకష్ణ యాదవ్‌, నగరపాలక సంస్థ ఎస్‌ఇ శ్యాంసుందర్‌, తెనాలి, పొన్నూరు మున్సిపల్‌ కమిషనర్లు శేషన్న, నయిమ్‌ అహ్మద్‌, సీపీఓ శేషశ్రీ, డీపీఓ శ్రీదేవి, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈఓ మోహనరావు, నాగర్జున సాగర్‌ కెనాల్‌ ఈఈ మురళీధర్‌, పాల్గొన్నారు.

➡️