పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ప్రజాశక్తి-కొండపి: కొండపి మండలంలో సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఈవో-2 రామారావు తెలిపారు. ఆదివారం కొండపి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంఈవో రామారావు మాట్లాడుతూ 10వ తరగతి రాస్తున్న విద్యార్థు లకు కొండపిలో మూడు సెంటర్ల ఏర్పాటు చేయడం జరిగిం దన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 158 మంది, చాణక్య జూనియర్‌ కళాశాలలో 220 మంది, గురుకుల పాఠశాలలో 215 మంది పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు నెప్పల శాస్త్రిని చీప్‌గా, పి తిరుపతి స్వామిని డిపార్టుమెంట్‌ అధికారిగా, చాణక్య కళాశాలలో అనురాధను చీఫ్‌గా, బి శ్రీనివాసరావును డిపార్టుమెంట్‌ అధికారిగా, గురుకుల పాఠశాలలో పిచ్చయ్యను చీఫ్‌గా, ఎల్‌వి ప్రసాదును డిపార్టుమెంటల్‌ అధికారిగా నియమించినట్లు తెలిపారు. పదో తరగతి రాస్తున్న విద్యార్థులు పరీక్షల సెంటర్లకు అరగంట ముందు రావాలని తెలిపారు. ఒక్క నిమిషం లేటుగా వచ్చినా పరీక్షల హాలులోకి రానివ్వరన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యార్థులను అరగంట ముందు తీసుకొని రావాలని తెలిపారు. పెద్దదోర్నాల: పెద్దదోర్నాల మండలంలో సోమవారం నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మండల విద్యాశాఖధికారి బి మస్తాన్‌నాయక్‌ తెలిపారు. 10వ తరగతి పరీక్షలు ఈ నెల 18 తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయన్నారు. మండలంలో వివిధ పాఠశాలల నుంచి 688 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. దోర్నాలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం కోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 284 మంది, వసంత జూనియర్‌ కాలేజీలో 250 మంది, రవీంద్ర ఉన్నత పాఠశాలలో 154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడం కోసం చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌, ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాలలో సెల్‌ ఫోన్‌ తీసుకురాకూడదన్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరిగే సమయంలో పరీక్ష కేంద్రాల చుట్టూ ఉండే జిరాక్స్‌ సెంటర్స్‌ మూసి వేయాలని ఆయన కోరారు.

➡️