పదో రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

మున్సిపల్‌ కార్మికుల సమ్మె గురువారానికి పదో రోజుకు చేరింది. ఈ సమ్మెకు డ్రైవర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా స్థానిక వంగాయగూడెంలోని వెహికల్‌ డిపో వద్ద చెత్తసేకరణ వాహనాలు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మద్దతు తెలిపిన ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు, ట్రాక్టర్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు అంతర్వేది శేఖర్‌, పంతగాని రాజేష్‌ మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, ప్రభుత్వ మొండివైఖరి వీడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌బాబు, ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.గోపి, ఇతర నాయకులు లావేటి కృష్ణారావు, పంతం నాగరాజు, బంగారు వెంకటేశ్వరరావు, గణేషు, రాజు, మేతర పాప, బండి భవాని, భాగ్యలక్ష్మి, రమణమ్మ, దావీదు, గోపి పాల్గొన్నారు.ఎఐటియుసి ఆధ్వర్యాన జరుగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె గురువారానికి రెండో రోజుకు చేరింది. మున్సిపల్‌ అధికారులు సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తూ ప్రయివేటు వ్యక్తులతో పారిశుధ్య పనులను చేయిస్తున్న ప్రదేశాల్లో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఎఐటియుసి) నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు కె.కృష్ణమాచార్యులు, బండి వెంకటేశ్వరరావు, ఎ.అప్పలరాజు, యూనియన్‌ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. నూజివీడు:పట్టణంలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి జి.రాజు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు ఎన్నికల ముందు సిఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ కార్మికులకు నష్టం కలిగించే ఆప్కాస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాడ్యుటీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి పట్టణ కార్యదర్శి పుల్లారావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రజని, ఉషారాణి, రాణి, పద్మ, భవాని, గోవిందు, పృధ్విరాజు, గాంధీ, రవి, గంగాధర్‌ పాల్గొన్నారు. చింతలపూడి :పట్టణంలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, పద్మ, కమలమ్మ పాల్గొన్నారు.

➡️