పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రత చర్యలు : కలెక్టర్‌

Dec 2,2023 19:56

ప్రజాశక్తి-విజయనగరం  :  జిల్లాలో ప్రమాదకర రసాయనాలను నిల్వచేసే పరిశ్రమల ద్వారా విపత్తులు సంభవించకుండా ఆయా పరిశ్రమలు తగిన భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి విపత్తుల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదేశించారు. ప్రమాదకర రసాయనాలు నిల్వచేసే లేదా వాటిని వినియోగించే పరిశ్రమల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు ఏర్పాటైన జిల్లా (క్రైసిస్‌ గ్రూప్‌) విపత్తుల నిర్వహణ కమిటీ తొలి సమావేశం శనివారం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యలు, ప్రమాదాలు జరిగిన వెంటనే చేపట్టాల్సిన సహాయక చర్యలపై చర్చించారు.అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల ఆవరణలో జరిగే ప్రమాదాలకు సంబంధించి ఆయా పరిశ్రమలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయో వాటి ప్రణాళికలను నెలాఖరులోగా జిల్లా స్థాయి కమిటీకి అందజేయాలని ఆదేశించారు. ప్రమాదకర రసాయనాలను ట్యాంకర్ల ద్వారా రవాణా చేసేటపుడు తగిన భద్రత నియమాలు పాటించేలా రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రసాయనాలు తీసుకువెళ్లే ట్యాంకర్లు మార్గమధ్యంలో తమకు తోచినప్రదేశంలో నిలిపివేయకుండా, వాటిని నిలిపిన ప్రదేశం, ఆయా రసాయనాలకు సంబంధించిన సమాచారం సమీపంలోని పోలీసు, ఫైర్‌ తదితర శాఖల అధికారులకు తెలియజేసేలా స్పష్టమైన నిబంధనలు రూపొందించాలన్నారు. ఆయా వాహనాలకు ప్రమాదం జరిగినపుడు దానివల్ల ఆ సమీప ప్రాంతంలోని వారికి సమస్యలు లేకుండా చూసేందుకు హెచ్చరిక వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయాల్సి వుందన్నారు. ఈ అంశంపై అవగాహన, సన్నద్ధత కోసం ఈనెల 21న మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేవించారు. మైలాన్‌ పరిశ్రమలో దీనిని నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్టు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ నారాయణ తెలిపారు.ఆయా రసాయనిక పరిశ్రమల సమీప గ్రామాల ప్రజలకు ప్రమాదాలు జరిగే సమయంలో ఏవిధంగా వ్యవహరించాలనే అంశంపై శిక్షణ ఇవ్వాలన్నారు. విశాఖలోని సివిల్‌ డిఫెన్స్‌ విభాగం ద్వారా ప్రజలకు యీ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్టు సివిల్‌ డిఫెన్స్‌ డిప్యూటీ కలెక్టర్‌ పద్మలత చెప్పారు. జిల్లాలో అత్యంత ప్రమాదకర రసాయనాలు నిల్వచేసే పరిశ్రమలు లేవని, అయితే ప్రమాదకర రసాయనాలు నిల్వచేసే ఫ్యాక్టరీలు పది వరకు వున్నట్టు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జివివిఎస్‌ నారాయణ చెప్పారు. వీటిలో ఎనిమిది పరిశ్రమలు ప్రమాదాలు జరిగినపుడు హెచ్చరించే సెన్సర్‌ వ్యవస్థలు కలిగివున్నాయని, మరో రెండు పరిశ్రమల్లో ఏర్పాటు కావలసి వుందని వివరించారు. అవి ఏర్పాటు కావలసి వున్న రాజాంలోని వెంకటశ్రీనివాస, సీతారామ ఆయిల్‌ మిల్స్‌లో నెలరోజుల్లోగా ఏర్పాటు చేయించాలని కలెక్టర్‌ చెప్పారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రాంబాబు, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ రాంప్రకాష్‌, విశాఖలోని జాయింట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జె.శివశంకర్‌ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఇ.ఇ. సరిత, రవాణాశాఖ అధికారి రమేష్‌, ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ డిపిఎం రాజేశ్వరి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ భాస్కరరావు, రెడ్‌ క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌ ప్రసాదరావు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️