పరిష్కరించేదాకా వెన్నంటే..

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేపట్టిన అంగన్‌వాడీలకు సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ అండగా ఉంటామని వివిధ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట కొనసాగుతున్న సమ్మె శిబిరంలో శనివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట శిబిరాన్ని అవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ చిస్టి, శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి సందర్శించి మాట్లాడారు. గుంటూరు శిబిరంలో సిఐటియు గుంటూరు నగర తూర్పు ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నేతాజి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.హనుమంతరావు, ఐఎల్‌సి ఉద్యోగుల సంఘం నాయకులు వివికె సురేష్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు శ్రీనివాసరావు, మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి సలీం, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు పి.శ్రీనివాసరావు, జనసేన జిల్లా నాయకులు బి.మల్లిక, ఎ.హరి, టిడిపి లీగల్‌ నాయకులు సెల్‌ సిహెచ్‌.రమేష్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.శంకర్రావు, సిఐటియు పశ్చిమ కమిటీ ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు, ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ నాయకులు జి.శేషగిరిరావు తదితరులు ప్రసంగించారు. నేతాజి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్యయుతంగా నోటీసు ఇచ్చి, సమ్మె చేపట్టినా విచ్ఛిన్నానికి రకరకాలుగా ప్రయత్నిస్తోందన్నారు. బెదిరింపులు, అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగుల గొట్టటం, రూ.4.5 వేలు వేతనం పెంచినట్లు దుష్ప్రచారం చేస్తోందని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో సెంటర్ల నిర్వహణ సాధ్యం కాదన్నారు. పిల్లల ఆలనా పాలనా చూడటం, వారికి ముక్కొచ్చినా, బాత్‌రూమ్‌ వచ్చినా శుభ్రం చేసేది అంగన్‌వాడీలేనని చెప్పారు. సెంటర్లు తెరిపించటానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని పలుచోట్ల లబ్దిదారులు అడ్డుకొని, అంగన్‌వాడీలకు అండగా ఉంటున్నారని తెలిపారు. సమ్మె కేవలం అంగన్‌వాడీల కోసమే కాదని, పేద గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమం కోసమని వివరించారు. వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇవ్వాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, సంక్షేమ పథకాల వర్తింపు, రిటైర్మెంట్‌ బెన్ఫిట్స్‌ పెంపు, మినీ సెంటర్లు మెయిన్‌ సెంటర్లుగా మార్చటం తదితర డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకూ అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ అంగన్‌వాడీలు నోటికి నల్ల రిబ్బన్లు కొట్టుకొని నిరసన తెలిపారు. సమ్మెకు టిడిపి గుంటూరు తూర్పు నియోజకవర్గ నాయకులు ముజీబ్‌ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా, నగర ప్రధాన కార్యదర్శులు పి.దీప్తి మనోజ, టి.రాధ, నాయకులు చిన వెంకాయమ్మ, పద్మ, రమణ, వేదవతి పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. అధికారుల బెదిరింపులను తట్టుకుని పట్టుదలతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం నుండి లబ్ధిదారుల మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని అంగన్వాడీలు చేపడుతున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షురాలు కెపి.మెటిల్డాదేవి చెప్పారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని సమ్మె శిబిరాన్ని ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ చిస్టి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి శుక్రవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. చిస్టి మాట్లాడుతూ చలి చీమల వంటి అంగన్వాడీలు, వారి కుటుంబ సభ్యులు తలుచుకుంటే ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తి ఉందన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాల ద్వారా సాధించిన గత విజయాలను గుర్తు చేశారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరించాల్సిందేనని, సెంటర్‌ తాళాలు పగలగొట్టి అంగన్వాడీలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీలకు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, రాజధాని నిర్మాణం, తదితర రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నించకుండా జగన్మోహన్‌రెడ్డి నోటికి మోడీ వేసిన తాళాన్ని పగలగొట్టాలని, రాష్ట్ర ప్రజల కోసం బిజెపిని ప్రశ్నించాలని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో స్కీం వర్కర్లు, అంగన్వాడీలు, కార్మికులు, ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. శివకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు, అడ్డంకులు సృష్టించినా, ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించినా వెనక్కు దగ్గేది లేదన్నారు. ప్రభుత్వానికి అంగన్వాడీల నిరసన సెగ తగిలేలా పోరాడాలని పిలుపునిచ్చారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ కేంద్రాలను నడుపుతామనే చర్యలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్‌ సిలార్‌ మసూద్‌, నిర్మల, ఆదిలక్ష్మి, రేవతి, కవిత, శోభారాణి, విజరు కుమారి, రాజకుమారి, శార్వేజి అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️