పరిహారం చెల్లింపునకు మీనమేషాలు

Jan 5,2024 20:31

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  అసలే అరకొర లెక్కలు… ఆపై నష్టపరిహారం చెల్లింపునకు మీనమేషాలు. దీంతో మిచౌంగ్‌ తుపాను కారణంగా పంటనష్టపోయిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట ఇంటికి చేరితో ఈపాటికే నలగురిలా ధాన్యం డబ్బు చేతికి అందేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో లక్షా 66వేల ఎకరాల్లో సాగైంది. మిచౌంగ్‌ తుపాను గత నెలలో నాలుగు రోజులు పాటు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వేలాది ఎకరాల్లో వరి నీట మునిగిపోయినప్పటికీ నష్టగణనలో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం నేలకు ఒరిగిపోవడం లేదా మునిగిపోవడం వంటివాటినే ప్రామాణికంగా తీసుకున్నారు. దీంతో, కేవలం 667 ఎకరాల్లో 1059 మంది రైతులు మాత్రమే నష్టపోయినట్టు అధికారులు గుర్తించారు. వీరికి రూ.50.62లక్షలు ప్రభుత్వం నుంచి అందాల్సివుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు కలిపి రూ.70లక్షల మేర నష్టపరిహారం అందాల్సివుందని, త్వరలోనే చెల్లిస్తామని వారం రోజుల క్రితం జరిగిన జిల్లా పరిషత్‌ సమావేశంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన విషయం విధితమే. పండగ దగ్గర పడుతున్నా పరిహారం చెల్లించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను నష్టం వల్ల అందరిలా సంక్రాంతి పండగ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. పంటనష్టం వాటిల్లిన మండలాల్లో సాలూరు, పాచిపెంట, సీతానగరం, పార్వతీపురం, జియ్యమ్మవలస, తదితర మండలాల్లో పంటనష్టం వాటిల్లింది. ఇతర మండలాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో, చేతికి అందొచ్చిన పంట వర్షార్పణ అయిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పరిహారమైన వస్తుందని ఎదురు చూస్తున్న వీరికి సంక్రాంతికి నిరాశే మిగలనుంది.

➡️