పల్నాడుకు ఎంతో చేశా

Jan 24,2024 00:37

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా అభివృద్ధికి కోసం గత ఐదేళ్లలో తాను ఎంతో కృషి చేశానని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరు ఎంపీల మాదిరిగా వ్యాపారాలు చేసుకుంటూ, అందుబాటులో లేకుండా పోలేదన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. పల్నాడుని అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చాలని పరితపించానని, సిఎం జగన్‌ తనకు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా తాను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించానని చెప్పారు. శంకుస్థాపనలకే పరిమితమైన వరికెపూడిసెల ప్రాజెక్టుకు అటవీ అనుమతులను సాధించి నిర్మాణంలో పురోగతిని సాధించామన్నారు. మెరుగైన వైద్యం కోసం అల్లాడుతున్న పల్నాడు ప్రజానీకానికి సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందేలా, మెడికల్‌ విద్య అందేలా పల్నాడులో మెడికల్‌ కాలేజీని నిర్మిస్తున్నారని తెలిపారు. మాచర్ల, రొంపిచర్లలో కొత్తగా రెండు కేంద్రియ విద్యాలయాలను మంజూరు చేయించినట్టు తెలిపారు. దాదాపు రూ.3000 కోట్లతో జాతీయ రహదారులు సాధించానని, 30 నిమిషాల్లోనే ప్రజలు హైవే పైకి చేరుకునేలా పల్నాడులో రహదారులు వచ్చాయని అన్నారు. వ్యవసాయాధారితమైన పల్నాడులో రైతులకు మేలు జరిగేలా ఇండో – ఇజ్రాయిల్‌ ప్రాజెక్టు సాధించానని, ఇటీవలే శంకుస్థాపన చేశామని చెప్పారు. జెఎన్‌టియు నర్సరావుపేట కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మించుకుని కళాశాలకు కొత్త కళ తీసుకొచ్చామని చెప్పారు. పొలాలకు, డొంకలకు వెళ్లే మార్గాలను సొంత నిధులతో బాగుచేయించినట్లు చెప్పారు. అయితే కొన్ని రోజులుగా తన సీటు విషయంలో అనిశ్చితి నెలకొందని, అటు నాయకులు, ప్రజలు, క్యాడర్‌ గందరగోళ వాతావరణంలోకి వెళ్లారని చెప్పారు. దీని వల్ల అటు నాయకులకు, పార్టీకి, తనకి ఎవరికీ ఉపయోగం లేదని, వీటన్నిటికీ తెరదించుతూ తన పదవికి, వైసిపి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.

➡️