పల్లెల్లో కనుమ సందడి

Jan 16,2024 22:14

సంక్రాంతి పండగ సందర్భంగా కనుమను పురష్కరించుకుని పల్లెలన్నీ కలకళలాడాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఇసుక తిన్నెలపై ఆటపాటలతో సందడి చేశారు. పండటగ సందర్బంగా మూడు రోజులూ పలు గ్రామల్లో వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించారు. సీతానగరంలో సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా పూర్వ కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి జ్ఞాపకార్థం రెడ్డివారి వలసలో సిపిఎం ఆధ్వర్యంలో ఆటల పోటీలను నిర్వహించారు. పండగ సందర్భంగా కురుపాం మండలంలోని దొంతి కొండకు జనం పోటెత్తారు. పార్వతీపురం మండలంలోని వింజమ్మతల్లి మెరక పండగలను ఘనంగా చేపట్టారు.

ప్రజాశక్తి- సీతానగరం:  ప్రజల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు పండుగలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి. జగన్మోహనరావు అన్నారు. తన స్వగ్రామం బూర్జలో సంక్రాంతి వేడుకలను కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో ఆయన సరదాగా జరుపుకున్నారు. అందరూ నూతన వస్త్రాలు, సంప్రదాయ వస్త్ర ధారణలో కను విందు చేస్తూ ఆట పాటలతో సందడి చేశారు. చిన్నారులతో సరదాగా గడిపారు. ఇళ్ళ ముంగిట్లో వేసిన ముగ్గులు, రంగవల్లికలను తిలకించారు. సంక్రాంతి పండుగ సంప్రదాయ అర్థం కలిగించే ముగ్గులు పరిశీలించి వారిని కొనియాడారు. పిల్లలకు వాటి విశిష్టతను వివరించారు. అందరూ వారి బాల్య స్మృతులను గుర్తు చేసుకొని స్నేహపూర్వకంగా మెలిగారు. పండుగల్లో పూర్వ కాలం నుండి తయారు చేస్తున్న పిండి వంటకాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందుకే మన పూర్వీకులు,పెద్దలకు ఆరోగ్య సమస్యలు అంతగా ఉండేవి కావని ప్రతీ ఒక్కరూ ఇటువంటి ఆహారపు అలవాట్ల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం కనుమ పండుగను ఘనంగా చేసుకున్నారు. సువర్ణముఖి నది సమీపంలో ఉన్న గ్రామాలు గెడ్డలుప్పి, సీతానగరం, లక్ష్మీపురం, బుర్జ గ్రామాల ప్రజలు ఇసుక దిబ్బలకు వచ్చి కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళ తో పలు ఆటలు ఆడుకున్నారు. కొత్త పరిచయాలతో సందడి సందడిగా జరిగింది.దొంతి కొండకు పోటెత్తిన సందర్శకులుకురుపాం : సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణాల నుండి పల్లెలకు వచ్చిన వారు మండలంలో మొండెంఖల్లు గ్రామంలో ఉన్న దొంతి కొండకు వేల సంఖ్యలో చేరుకుని మంగళవారం సాయంత్రం సందడి చేశారు. గిరిజన గ్రామాలకు ముఖ ద్వారంగా ఉన్న మొండెంఖల్‌లో రెండు కొండలు దొంతి కొండలు ఆకారం ఉంటూ చుట్టూ ఆహ్లాదకర వాతావరణ చూడడానికి ప్రత్యేకంగా కనువిందు చేస్తుంటుంది. దీంతో మండలంలో వివిధ గ్రామాల నుండి ఆనవాయితీగా అక్కడకు వచ్చే సందర్శిస్తుంటారు. కొండల నడుమ వెలిసిన నీలమ్మ తల్లిని దర్శనం చేసుకుంటారు. ఇది ఏటా సంక్రాంతి, కనుమ రోజున ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. గుమ్మలక్ష్మీపురం: పల్లెల్లో సంక్రాతి పండుగను ప్రజలు ఆనందోత్సవాల నడుమ సందడిగా జరుపుకున్నారు. మండలంలోని మూల జమ్ము గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో యువతి, యువకులు, మహిళాలు కబడ్డీ, కుర్చీ ఆట, తాడు ఆట, పాటల పోటీలు నిర్వహించారు. తాడికొండ జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. గిరిజన గ్రామాల్లో సాంస్కృక కార్యక్రమాలను నిర్వహించారు. జియమ్మవలస మండలంలోని పెద్దబుడ్డిడి గ్రామంలో బంధువులు అంత కలసి వంటలు చేసి సహాపంతి భోజనాలు చేశారు. తప్పెటగుళ్ళు, కోలాటం నిర్వహించారు. గ్రామానికి సమీపంలో ఉన్న గల్లీ తోట వద్ద యాత్రకు పిల్లలు, పెద్దలు వెళ్లి సందడిగా గడిపారు.వేడుకగా వింజమ్మతల్లి మెరక పండుగపార్వతీపురంరూరల్‌: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కనుమ పండగ సందర్భంగా పార్వతీపురం మండలంలోని పలు గ్రామాల్లో మేరక పండగలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. పలు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద పండగ కోసం తమ తమ గ్రామాలకు చేరుకున్న వారు కనుమ రోజు నాడు ఊరి శివారులో ఉన్న మెరకకు చేరుకొని భారీ జన సందోహం మధ్య ఒకరినొకరు పలకరించుకుంటూ ఆప్యాయతలను వలకబోస్తూ ఆనందంగా గడిపారు. ఈ క్రమంలో మండలంలోని తాళ్ళబురిడి గ్రామంలో గ్రామానికి చెందిన యువజన సంఘం నిర్వహించిన వింజమతల్లి కొండ పండుగను వేడుకగా నిర్వహించారు. భారీ ఎత్తున గ్రామస్తులు హాజరై తమ చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్ర స్థానిక నాయకులు బేత లక్ష్మణరావు, బుడితి శ్రీరామ్‌, శ్రీధర్‌ తదితరులతో కలిసి వింజమ్మతల్లి నుంచి దర్శించుకుని ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని నర్సిపురం గ్రామంలో గ్రామ శివారులో నిర్వహించిన మెరక పండగలో పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరై ఆనందంగా గడిపారు.

➡️