పల్లె రహదారులకు మోక్షం కలిగేనా?

Mar 3,2024 21:23

ప్రజాశక్తి – వీరఘట్టం: ఏ గ్రామంలోని రోడ్లును చూసినా అధ్వాహ్నంగా దర్శనమిస్తున్నాయి. మీ గ్రామాలకు రహదారి సౌకర్యంతో పాటు అనేక మౌలిక వసతులు కల్పిస్తామని సమయం వచ్చినప్పుడల్లా పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారు తప్ప ఆచరణలో ఎక్కడా కాన రావటం లేదు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని నానుడు. అప్పట్లో పల్లెలు ఆహ్లాదకరంగా ఎంతో ముచ్చటగా కనిపించడంతో ఎక్కువగా ప్రజలు పల్లెలను చూసేందుకు ముచ్చట పడేవారు. ఇప్పుడు ఆ పల్లెల రహదారులు దుమ్ము, ధూళితో దర్శనమిస్తున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా, ఎక్కడ చూసినా పల్లెల రహదారులు అధ్వానంగానే దర్శనమిస్తున్నాయి. ఇటువంటి రహదారులపై ప్రయాణించాలంటే సాహసించాల్సిందే. అటువంటి రహదారులే మండలంలోని ప్రతి గ్రామంలో దర్శనమిస్తున్నాయి. మండల కేంద్రంలోని ప్రధాన రహదారితో పాటు యు.వెంకంపేట, నీలంపేట, ఎలిసాపురం, సంధిమానుగూడ, బట్టి మానుగూడ, కాగితాడ, గదబవలస, పివిఆర్‌ పురం, చిదిమి, చేబియ్యంవలస, డిపి వలస, బల్లగుడ్డి, కె.ఇచ్చాపురం, తదితర పల్లెల రహదారులు నేటికీ అభివృద్ధికి నోచుకోకపోవడంతో ప్రజలకు రాకపోకలు సాగించేందుకు అవస్థలు తప్పటం లేదు. మండలంలోని హుస్సేన్‌ పురం సెవెంత్‌ బ్రాంచి కాలువ నుండి ఈ గ్రామం మీదుగా నీలంపేట నుంచి సందిమానుగూడ వరకు గత ప్రభుత్వ హయాంలో 2019లో రూ 4.67 కోట్లతో బిటి రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు మట్టిని లెవెల్‌ 40 ఎంఎం చిప్స్‌ వేసి రోలింగ్‌ చేసి అలాగే వదిలేశారు. సిఎస్‌పి రహదారి నుండి యు వెంకంపేట మీదుగా చిదిమి వరకు కోటి రూపాయలతో బిటి రహదారి నిర్మించేందుకు పనులు చేపట్టారు. ఆడారు బిటి రహదారి నుండి డిపి వలస వరకు కోటి రూపాయలతో బిటి రహదారి నిర్మించేందుకు పనులు చేపట్టారు. సిఎస్‌పి రహదారి నుండి చిదిమి వరకు రూ.కోటీ21 లక్షలతో బిటి రహదారి నిర్మించేందుకు పనులు చేపట్టారు. అయితే ఎక్కడ కూడా రహదారుల పనులు పూర్తికాకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో దర్శనమిస్తున్నాయి. ఈ కారణంగా పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీటలు వారిన బిటి రహదారులుమండలంలోని కొట్టుగుమ్మడ, ఎం.రాజపురం, తలవరం, కంబర, చిట్టిపూడివలస తదితర గ్రామాల బిటి రహదారులు బీటలు వారి దర్శనమిస్తున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి రహదారి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాలం చల్లకుండానే రహదారులు ఎక్కడికక్కడే గుంతలు ఏర్పడి, రాలు తేలి ఉన్నాయి. దీంతో ముఖ్యంగా విద్యార్థులు, గర్భిణీలు, వద్ధులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రహదారుల అభివృద్ధిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

➡️