పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

Feb 11,2024 00:30

సమావేశంలో మాట్లాడుతున్న చాంద్‌బాషా
ప్రజాశక్తి-గుంటూరు :
గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్‌బాషా కోరారు. శనివారం స్థానిక ఎపిజిఇఎ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చాంద్‌బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించి జిపిఎస్‌ తెచ్చిందన్నారు. ఉద్యోగ విరమణ తరువాత పాత పెన్షన్‌ ఉద్యోగికి రూ.100 లబ్ది చేకూరితే, సిపిఎస్‌ ఉద్యోగికి రూ.25 మాత్రమే లబ్ధి చేకూరుతుందని టక్కర్‌ కమిటీ రిపోర్ట్‌లో తేల్చారన్నారు. పాత పెన్షన్‌ వల్ల ప్రభుత్వంతో జీవితాంతం సంబంధం ఉంటుందని, ఏడాదికి రెండు డిఎలు, ఐదేళ్లకు ఒకసారి పిఆర్‌సితో పెన్షన్‌ పెంపు సౌలభ్యం, ఉద్యోగ విరమణ తర్వాత హెల్త్‌ కార్డులు వర్తిస్తాయియని, జీవితాంతం పెన్షన్‌, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ తదితర సదుపాయాలు ఉంటాయని వివరించారు. జిపిఎస్‌ ద్వారా షేర్‌ మార్కెట్‌ ఆధారిత పెన్షన్‌ అని, పదవీ విరమణ తర్వాత డిఎ, పిఆర్‌సి వర్తించవని, అనేక ముఖ్యమైన లోపాలు జిపిఎస్‌లో ఉన్నాయన్నారు. జిపిఎస్‌ రద్దు చేసి, ఓపిఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు హుస్సేన్‌ ఖాన్‌, సంయుక్త కార్యదర్శి జి.శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి నాగభూషణం, జాను పాల్గొన్నారు.

➡️