పారదర్శకంగా ఓటరు జాబితా

Dec 8,2023 23:50
ఎబివిఎస్‌పి శ్రీనివాస్‌,

ప్రజాశక్తి – రాజమహేంద్రవరంఓటరు జాబితాను పారదర్శకంగా రూపొం దించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌ లో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2024 పై ఎన్నికల నమోదు అధికారులతో సమీక్ష, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ కె. మాధవీలత, ఇతర నియోజకవర్గ ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హేతుబద్దత కలిగిన ఓటరు జాబితా రూపుదిద్దడంలో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం అవ్వడం, ఓటు హక్కు వినియోగించేలా చైతన్యం ప్రజల్లో కల్పించాలని సూచించారు. జిల్లాలో 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఓటర్‌గా నమోదు లక్ష్యంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం జరగాలని అన్నారు ఓటు హక్కుతోపాటు రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడమే లక్ష్యంగా విస్తృత స్థాయిలో అవగాహన దిశగా అడుగులు వేయడం ముఖ్యం అన్నారు. అధికారులు, రాజకీయ పార్టీలు కలిసి ఆమేరకు పని చేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పుల సవరణకు సంబంధించి ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా రికార్డులు నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలు, వార్డు సచివాలయల్లో నోటీసులను ఉంచాలని, అదేవిధంగా వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయి బిఎల్‌ఒలు, జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇపి రేషీయో, జెండర్‌ రేషియో విషయంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి ఆ మేరకు సిద్దం చేయాలన్నారు. ఎఫ్‌పి షాప్‌లో రేషన్‌ కార్డులు కల్గిన 18 ఏళ్లు నిండిన వారి వివరాలు, ఆ పోలింగ్‌ కేంద్రంలో ఉన్న ఓటర్ల సంఖ్యతో పరిశీలించి ఆమేరకు హేతుబద్ధత కలిగిన ఓటరు జాబితా రూపొందించడంపై అధ్యయనం చేయా లన్నారు. ప్రతి నియోజక వర్గం పరిధిలో కనీసం ఐదు ఎఫ్‌పి షాప్‌ల పరిధిలో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు కలెక్టర్‌ తెలియచేశారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె. మాధవీలత జిల్లాలో ఎస్‌ఎస్‌ఆర్‌-2024 రూపకల్పనపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1,569 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. 15,76,026 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 7,71,192 మంది పురుషులు, 8,04,725 మంది మహిళలు, 109 మంది ఇతరులు ఉన్నారని కలెక్టర్‌ తెలి పారు. ఫారం 6, 7, 8లకు సంంధించిన క్లైములు 2,92462 రాగా, అందులో250096 పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలిన 42,366 దరఖాస్తులను గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని వివరిం చారు. ప్రత్యేక శిబిరాల్లో మొత్తం 31,748 దరఖాస్తు వచ్చాయన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టడంతోపాటు అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ జరుగుతుం దన్నారు. ఈనెల 26 నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరించి, 2024 జనవరి 5న ఓటర్ల తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జెసి ఎన్‌. తేజ్‌ భరత్‌, కమిషనర్‌ కె. దినేష్‌ కుమార్‌, డిఆర్‌ఒ జి.నరసింహులు, సహాయ కలెక్టర్‌ సి. యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, నియోజక వర్గ ఎన్నికల అధికారులు ఎ.చైత్రవర్షిణి, ఎబివిఎస్‌పి శ్రీనివాస్‌, కృష్ణ నాయక్‌, ఎమ్‌.ఝాన్సీరాణి, ఎస్‌. సరళా వందనం, ఎమ్‌. వెంకట సుధాకర్‌ పాల్గొన్నారు.

➡️