పార్టీ పదవులకు కిమిడి రాజీనామా

Mar 29,2024 19:46

 అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ

ప్రజాశక్తి-చీపురుపల్లి : తనకు చీపురుపల్లి అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయించనందుకు నిరనసనగా తెలుగుదేశం విజయనగరం పార్లమెంటు స్థానం అధ్యక్ష పదవికి, చీపురుపల్లి నియోజకవర్గ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కిమిడి నాగార్జున ప్రకటించారు. శుక్రవారం తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం విడుదల చేసిన అభ్యర్థుల ఆఖరి జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా పార్టీ కోసం కార్యకర్తల కోసం నిరంతర శ్రామికుడిలా పని చేశానన్నారు. అయితే పార్టీ తనను కాదని వేరొకరికి పార్టీ టిక్కెట్‌ కేటాయించడం బాధాకరమైన విషమన్నారు. కష్టపడి పనిచేస్తే పార్టీ తనకు టిక్కెట్‌ ఇవ్వకుండా క్షవరం చేసిందన్నారు. తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని నాగార్జున తెలిపారు.నాగార్జున వెంటే తాము కూడా నాగార్జున బాటలోనే తాముకూడా నడుస్తామని చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రౌతుకామునాయుడు, తెలుగు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పైల బలరాం తెలిపారు. వెన్నంటే ఉండి ఐదేళ్ల పాటు తమని నడిపించిన నాగార్జునకు టిడిపి రాష్ట్ర పార్టీ అన్యాయం చేయడం మంచి పద్దతి కాదని అన్నారు. అనంతరం చీపురుపల్లి టిక్కెట్టు నాగార్జునకు కాకుండా కళా వెంకటరావుకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి కార్యకర్తలు, నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కళావెంకటరావు వద్దు.. నాగార్జున ముద్దు అంటూ నినాదాలు చేసారు ర్యాలీలో రౌతు కామునాయుడు, పైల బలరాం, తాడ్డి సన్యాసినాయుడు, ముల్లు రమణ, సారిపాక సురేష్‌ తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️