పిఅర్‌సి, ఎరియర్స్‌ బకాయిల కోసం దశలవారీ పోరాటం

Dec 26,2023 21:39

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  పిఅర్‌సి, డిఎ ఎరియర్స్‌ బకాయిల కోసం దశల వారీ పోరాటాలకు ఉపాధ్యాయులు సిద్దం కావాలని యుటిఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి రెడ్డి మోహనరావు పిలుపునిచ్చారు.మంగళవారం యుటిఎఫ్‌ కార్యాలయం లో జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశం జిల్లా అధ్యక్షులు జెఅర్‌సి పట్నాయక్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ పిఅర్‌సి ఎరియర్లు రూ.6246 కోట్లు, డిఎలు 1,136 కోట్లు, పిఅర్‌సి తరువాత ప్రకటించిన డిఎ రూ.4884 కోట్లు, ఎపి జి ఎల్‌ ఐ మొత్తం 18,096 కోట్లు, సి పి ఎస్‌ ఉద్యోగుల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన వాటా సుమారు 2500 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆద్వర్యంలో ఈనెల 27న తాలూకా కేంద్రాల్లో 6 గంటల ధర్నా, జనవరి 3న విజయనగరం జిల్లా కేంద్రంలో 12 గంటల ధర్నా, రాష్ట్ర కేంద్రంలో జనవరి 9,10 తేదీల్లో 36 గంటల ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ధర్నాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎ విఅర్‌కె ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణలో భాగంగా విద్యా సామర్ధ్యాలు పెంచేందుకు వెనుకబడిన విద్యార్థులకు అదనపు సమయం బోదించాలని, పాత పెన్షన్‌ సాధన కోసం జనవరి 28న విజయవాడలో జరిగే బహిరంగ సభను విజయవంతం చెయ్యాలని కోరారు, సావిత్రిబాయి పూలే జయంతి సభలను జనవరి 2 నుండి జనవరి 8 వరకు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గౌరవాధ్యక్షులు మీసాల అప్పులనాయుడు, ఉపాధ్యక్షులు వి.ప్రసన్నకుమార్‌, కోశాధికారి భాస్కరరావు, జిల్లా కార్యదర్శులు కె. ప్రసాదరావు, పి. త్రినాథ్‌, పి. వాసుదేవరావు, బి. రామునాయుడు, వి. రాధాభవాని ఎన్‌. సత్యనారాయణ, సిహెచ్‌ తీరుపతినాయుడు, బి.రాజారావు, ఎస్‌.శ్రీను, అల్లు శంకరరావు పాల్గొన్నారు.

➡️