పెరగని కేటాయింపులు

Feb 8,2024 00:11

ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బుధవారం శాసనసభలో సమర్పించిన బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులేమీ చూపలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతేడాది కేటాయించిన నిధుల్లో చాలా వరకు ఖర్చు చేయలేదు. ప్రధానంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్ల పలు శాఖల్లో ప్రగతి చాలా తక్కువగా ఉంది. ప్రధానంగా భారీ నీటిపారుదల శాఖ, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలో గత బడ్జెట్లో కేటాయించిన నిధులు జిల్లాకు రాకపోవడం వల్ల పనులు పూర్తిస్థాయిలో చేపట్ట లేకపోయామని అధికార వర్గాలు తెలిపాయి. సంక్షేమ శాఖలకు కేటాయించిన ప్రజలు ఆయా పథకాలకు విడుదల చేయడం వల్ల కొంతమేరకు పేద ప్రజలకు డిబిటి ద్వారా వారి ఖాతాలో జమయ్యాయి. కాల్వల మరమ్మతులు సకాలంలో జరగకపోవడం వల్ల గత ఖరీఫ్‌ సీజన్లో సాగు సాగునీరు సక్రమంగా అందక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రహదారుల నిర్మాణానికి నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆర్‌అండ్‌ బి పంచాయతీరాజ్‌ శాఖలకు నిధుల కేటాయింపు ఈ ఏడాది కూడా పెరగలేదు. జలవనరుల శాఖ, సంక్షేమ శాఖలకు కూడా నిధుల కేటాయింపు గణనీయంగా తగ్గించినట్లు బడ్జెట్‌ అంచనాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ప్రధానంగా డెల్టాలో కాల్వలు మరమ్మతులు, డ్రెయినేజీ పనులు చేపట్టేందుకు ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదు. గుంటూరు ఛానల్‌ పొడిగింపు, విస్తరణ పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయన్నది స్పష్టత రాలేదు. వరికపుడిసెల ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసినా ఇంతవరకు నిధులు కేటాయించలేదు.

ఎన్నికల బడ్జెట్‌
పాశం
రామారావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి
ప్రజల ప్రయోజనాలు, అభ్యున్నతికి సంబంధించిన అంశాలను విస్మరించింది. ఆర్థిక మంత్రి ప్రసంగం ఎన్నికల ప్రసంగాన్ని తలపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశంపై మౌనం వహించారు. వేలాది మంది నిర్వాశితుల గురించి బడ్జెట్‌లో ప్రతిపాదనలు లేవు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు వారి పోరాటాల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ఆర్భాటంగా ప్రకటించిన జగనన్న కాలనీల నిర్మాణానికీ నిధులు పెంచలేదు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమూ ఇవ్వలేదు. ఇది కేవలం ఎన్నికల బడ్జెట్‌.

చిత్తశుద్ధి లేని బడ్జెట్‌
గుంటూరు విజరుకుమార్‌, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమీ చేయకపోయినా అన్నీ చేసినట్లు చెప్పుకునే ఘనత వైసిపి ప్రభుత్వం సాధించింది. నిరుద్యోగం పెరిగితే నిరుద్యోగుల గురించి ఉద్యోగ కల్పన గురించి ఎక్కడ ప్రస్తావనలేదు. రూ.4 వేల కోట్లతో రోడ్లు అభివృద్ధి చేశామంటున్నారు.. మరి రోడ్లపై ఉన్న గోతులను చూసి ఆ డబ్బులు ఏమయ్యాయో సమా ధానం చెప్పాలి. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు సాగు తక్కువగా చేశారు. పంటల బీమా ఏ పంటలకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. సచివాలయ ఉద్యోగాలు తప్ప ఏ ఒక్కరికీ ఉద్యోగం కల్పిం చిన దాఖలాల్లేవు. 6100 పోస్టులతో నిరాశపరిచారు. ప్రధానంగా సిఎం శంకుస్థాపన చేసిన వరికపూడిశెలపై ప్రస్తావన లేకపోవడం దారుణం.

అప్పులు చేసి పంచమే పేదరిక నిర్మూలనా?
టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ
రూ.4.25 లక్షల కోట్ల నగదు బదిలీతో పేదరికం తొలగించామని ఆర్థికమంత్రి ప్రకటించడం వింతగా ఉంది. అప్పులు చేసి డబ్బులు పంచితే, అది పేదరిక నిర్మూలన ఎలా అవుతుంది? రాష్ట్రం రూ.12 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోతే తమ హయాంలోనే తక్కువ అప్పుటు చేసినట్లు చెప్పుకోవడం విడ్డూరం. పేదరికం తగ్గితే ఐదేళ్లలో ఉపాధి లేక 21 వేల మంది యువకులు, 4 వేల మంది రైతులు, రైతు కూలీలు, 200 మంది భవన నిర్మాణ కార్మికులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? విభజన సమస్యలు పరిష్కరించామనడం సిగ్గుచేటు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ 43 శాతం నుంచి 17 శాతంకు తగ్గింది. కార్మికుల నిజవేతనాలు తగ్గాయి. వైసిపి పాలనలో సాగు భూమి 1.19 కోట్ల ఎకరాల నుండి 88 లక్షల ఎకరాలకు తగ్గింది. వీటిని దాచిపెట్టి ఆత్మస్తుతి, పరనిందలా బడ్జెట్‌ ప్రసంగం సాగింది.

➡️