పెరుగుతున్న ఫ్లెక్సీ యుద్ధాలు

Feb 24,2024 00:20

గుంటూరు బస్టాండ్‌ వద్ద పోలీసులతో టిడిపి నాయకులు వాగ్వావాదం
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
ఎన్నికల షెడ్యూలుకు ముందే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటుపై ప్రచ్చన్నయుద్ధం మొదలైంది. ఫ్లెక్సీల వల్ల నిత్యం జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒకపార్టీకి చెందిన ఫ్లెక్సీలు మరొక పార్టీ వారు తొలగించారని వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా టిడిపి, వైసిపి ఫ్లెక్సీల మధ్య తరచూ వివాదాలు వస్తున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీల మద్ధతు దారులు పలువురు సిని నటుల ఫ్లెక్సీల ఏర్పాటులో కూడా ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటుపై నియంత్రణ కొరవడింది. ఎన్నికల నేపథ్యంలో ఇబ్బడి ముబ్బడిగా వైసిపి, టిడిపి ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. రాజకీయంగా ఎటువంటి పరిచయం లేని వారు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల ద్వారానే ప్రజల్లోకి వస్తున్నారు. ప్రధానంగా ఎన్‌ఆర్‌ఐలు, కోట్లకు పడగలెత్తి ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నవారంతా తమ పరిచయాన్ని ఫ్లెక్సీ ద్వారానే కొనసాగిస్తున్నారు. గతంలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి వెలువడటానికి ముందే వీటిపై నియంత్రణ ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. రోడ్డుపై ట్రాఫిక్‌కు అడ్డుగా అధికార పార్టీ నాయకులు సిద్ధం అంటూఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు. వైసిపికి పోటీగా దేనికైనా ‘సై’ అంటూ భారీగా ఎత్తున వైసిపి ఫ్లెక్సీలకు పక్కనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆవేశపూరితమైన కార్యకర్తలు ఏదోఒక ఫ్లెక్సీని తొలగిస్తే పెద్ద వివాదం ఏర్పడటం, పోలీసులు వీరిని నియంత్రించడానికి గంటల తరబడి సమయం వెచ్చించడం పరిపాటిగా మారింది. శుక్రవారం తూర్పు నియోజకవర్గంలో టిడిపి ఫ్లెక్సీలపై వైసిపికి చెందిన ఫ్లెక్సీలను కొంతమంది అంటించారు. దీంతోటిడిపి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసిపి ఫ్లెక్సీలను తొలగించారు. రోడ్డుపై బైటాయించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం ముట్టడించారు. తాము హోర్డింగ్‌ల నిర్వహాకుల నుంచి అనుమతి తీసుకుని ఫ్లెక్సీలు వేసుకున్నామని వీటిపై వైసిపినాయకులు ఫ్లెక్సీలు ఎలాఏర్పాటు చేస్తారని టిడిపి తూర్పు నియోజకవర్గం ఇన్‌ఛార్జి నశీర్‌ అహ్మద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ఫ్లెక్సీలు తొలగిస్తుండటంతో పోలీసులు,వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టిడిపి నేతలకు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టిడిపి ఎంపి అభ్యర్థి పేమ్మసాని చంద్రశేఖర్‌ ఫ్లెక్సీలపై పర్మిషన్‌ లేకుండా స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నశీర్‌ అహ్మద్‌, వి.శ్రీనివాస్‌ తదితరులు వైసిపి ఫ్లెక్సీలను తొలగించారు. పోలీసులకు టిడిపి కార్యకర్తలకు మధ్య వాగ్వావాదం జరిగింది. తరువాత బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ర్యాలీగా మునిసిపల్‌ కార్యాలయంకు వచ్చిన టిడిపి నాయకులు మునిసిపల్‌ అదనపు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రైవేటు సంస్థలకు చలానాలు కట్టి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటే వాటి మీద పర్మిషన్లు లేకుండా ఎమ్మెల్యే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గొడవలు సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. నగరపాలకసంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అనుమతి లేని వైసిపి ఫ్లెక్సీలు తొలగించాలని కోరారు.

➡️