పేదలకు ద్రోహం చేసిన ప్రభుత్వాన్ని సాగనంపాలి

Feb 4,2024 21:18

ప్రజాశక్తి-మదనపల్లి తమది పేదల ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా, ముమ్మాటికీ జగన్‌ది పెత్తందార్ల ప్రభుత్వమేనని, పేదలకు ద్రోహం చేసిన వైసిపి ప్రభుత్వాన్ని వెంటనే సాగనంపాలని విసికె పార్టీ నిర్వహించిన సామాజిక సత్యాగ్రహంలో టిడిపి, జనసేన, కాంగ్రెస్‌, సిపిఐ, సీపీఎం పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట విసికె పార్టీ ఆధ్వర్యంలో సామాజిక సత్యాగ్రహం పేరుతో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఎం.షా జహాన్‌ బాషా, జనసేన రాయలసీమ కన్వీనర్‌ గంగారపు రాందాస్‌ చౌదరి, కాంగ్రెస్‌ నాయకుడు రెడ్డి సాహెబ్‌, సిపిఐ నాయకుడు కోటూరి మురళీ, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు పాల్గొని పాల్గొని, సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ సర్కార్‌ చేస్తున్న సామాజిక విద్రోహంపై నిప్పులు చెరిగారు. సకల సామాజిక వర్గాలకూ అన్యాయం చేసిన జగన్‌ సర్కారు, సామా జిక న్యాయ సాధికార యాత్ర అంటూ నిస్సిగ్గుగా ఊరేగుతుందని ఎద్దేవా చేశారు. అనంతరం విసికె పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.టి.యం శివప్రసాద్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో పేద, మధ్య తరగతి వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని, నాలుగున్నర ఏళ్లుగా జగన్‌ సర్కారు చేస్తున్న దగాపై పేదల ధర్మారగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి తెలియజేసేందుకే సామాజిక సత్యాగ్రహం చేపట్టామని తెలిపారు. సత్యాగ్రహంలో పాల్గొని సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల నేతలకు అయన కతజ్ఞతలు చెప్పారు. ప్రతి వసతి గృహాల్లోని విద్యార్థులకు తప్పని సరిగా మెస్‌ ఛార్జీలు పెంచాలన్నారు. పేదలకు మూడు సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. దళితవాడలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి,మైనార్టీ, కాపు, ఇతర కార్పొరేషన్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విసికె రాష్ట్ర అధికార ప్రతినిధి యు. గణపతి, రాష్ట్ర కార్యదర్శులు ముత్యాల మోహన్‌, డాక్టర్‌ ప్రభు, పాలకుంట శ్రీనివాసులు, భారతీయ అంబేడ్కర్‌ సేన (బాస్‌) నాయకులు ప్రజాకవి పోతబోలు రెడ్డెప్ప, పల్లం తాతయ్య, బురుజు లక్ష్మీనారాయణ, సచిన్‌, బాలకష్ణ, టి.ఎ. పీర్‌ బాషా, రవిశంకర్‌, రెడ్డిప్రసాద్‌, రాయల్‌ సూరి, తలారి కష్ణ, క్రాంతి, జనార్దన్‌, గంగాధర్‌, చంద్ర, ఇర్ల రమణ, సిపిఐ నాయకులు తోపు కష్ణప్ప, సాంబశివ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

➡️