పేదల పక్షపాతి జగన్‌

Mar 13,2024 21:40

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పేదలు పక్ష పాతి, ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సిఎం జగన్మోహన్‌రెడ్డి అని వైసిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. బుధవారం వైసిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువజన భేరి ర్యాలీ, సభను నిర్వహించారు. స్థానిక వెంకటలక్ష్మి జంక్షన్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ,మూడు లాంతర్లు వరకు జరిగింది. మూడు లాంతర్లు వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నాడని విమర్శించారు. వైసిపికి అనుకూలంగా మాట్లాడిందని ఒక అమాయకురాలైన మహిళను వేధించి చంపేశారన్నారు. జగన్మోహన్‌రెడ్డి కనుసైగ చేస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామన్నారు. సంక్షేమ ,అభివృద్ధి ఎంత ముఖ్యమో శత్రువులను తొక్కడం కూడా అంతే అవసరం ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన కళ్యాణ్‌ చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నందునే జగన్‌ మంచోడు కాదని అంటున్నారని అన్నారు. మోడీని ఉగ్రవాది అని , భార్యను చూసుకోలేని వాడు దేశానికి ప్రధానిగా ఏమి చేస్తాడని తిట్టిన చంద్రబాబు నేడు బిజెపితో కలిశాడన్నారు. ఒక్క శాతం ఓట్లు లేని బిజెపి కి 6 ఎంపి సీట్లు, 6 శాతం ఓట్లు ఉన్న జనసేనకు 2 ఎంపి సీట్లు తీసుకున్నారంటే పవన కళ్యాణ్‌ పార్టీ పరిస్థితి గురించి తెలుసు కోవాలన్నారు. చంద్రబాబు చేసిన మోసాలు ప్రజలు మర్చిపోరని, వడ్డీతో సహా చెల్లించే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామిని, ఎంపిగా బెల్లాన చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో డిప్యూటి స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, యువజన విభాగం నాయకులు కౌశిక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️