పేరుకుపోతున్న నీటి పన్ను బకాయిలు

Mar 27,2024 21:06

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నీటి పన్ను వసూలు నామ మాత్రంగానే జరుగుతోంది. ప్రతి ఏటా నీటి పన్ను ద్వారా నగర పాలక సంస్థకు రూ.1.76 కోట్లు పనున్నుల రూపంలో వసూలు కావాల్సి ఉంది. గత కొంత కాలంగా కట్టాల్సిన పన్ను బకాయిలు రూ.4.4 కోట్లు వరకు ఉంది. ఈ ఏడాది పన్నుతో కలుపుకొని మొత్తం నగర పాలక సంస్థ కు రావాల్సిన నీటి పన్ను బకాయిలు 5.76 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఏటా నీటి పన్నుల వసూలులో పురోగతి కనిపించడం లేదు. ఏటా వసూలు కావాల్సిన పన్నులో కేవలం 50 శాతం వరకు మాత్రమే వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మిగిలిన బకాయిలు పేరుకుపోయి ఈ ఏడాది మార్చి నాటికి పాత బకాయి రూ.4.70 కోట్లకు పెరిగింది. పోనీ ఈ ఏడాది అయినా వసూలులో పురోగతి ఉందా అంటే అదీ లేదు. పాత బకాయి రూ.4కోట్లకు గాను కేవలం రూ.29 లక్షలు వసూలు అయ్యింది. ఈ ఏడాది నీటి పన్ను వసూళ్లలో 176 లక్షలకు గాను ఇప్పటి వరకు 76 లక్షలు మాత్రమే వసూలు చేశారు. అంటే పాత బకాయి రూ.4 కోట్లు, ఈ ఏడాది వసూలు ఇంకా వసూలు కావాల్సిన మరో కోటి రూపాయలు, వచ్చే ఏడాదికి పాత బకాయి కింద మరో రూ.4.70 కోట్లకు పన్నుల బకాయి పెరగనుంది. ఈ ఏడాది బకాయితో కలిపి రూ.5.76 కోట్లు వసూలు కావాల్సి ఉండగా దానిలో కేవలం రూ.కోటీ 5లక్షలు మాత్రమే వసూలు చేశారు. మొత్తం కలెక్షన్‌లో 20 శాతం కూడా నీటి పన్ను వసూలుకు నోచుకోలేదు. గతంలో పన్నుల వసూలుకు కేవలం పదుల సంఖ్యలో ఉండే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే వసూలు చేసేవారు. పని భారం ఎక్కువగా ఉండటం కారణంగా పూర్తి స్థాయిలో వసూలు వసూలు చెయ్యలేకపో యేవారు. కానీ వార్డు స్థాయిలో సచివాలయాలు ఏర్పాటైన తరువాత నగరంలో 59 సచివాలయాలు ఉన్నాయి. సచివాలయంలో రెవెన్యూ విభాగం కార్యదర్శులు కూడా అన్ని సచివాలయాల్లో ఉన్నారు. వారికి కూడా పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత ఉంది. సరిపడా సిబ్బంది ఉన్నా పన్నులు వసూలు కాకపోవడం అధికారులను ఆశ్చర్య పరుస్తోంది. కార్యదర్శులు పన్నులు వసూలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం, ఇళ్లలో ఎవరూలేని సమయంలో పన్నులు వసూళ్లకు వెళ్లడం వంటి కారణాల వల్ల నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థ అధికారులు పదే పదే పన్నుల వసూలుపై హెచ్చరించినా పురోగతి లేదంటే సిబ్బందికి ఉన్న శ్రద్ద ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అధికారులు దృష్టి సారించకపోతే నగర పాలక సంస్థకు మరింత నష్టం జరిగి ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.

➡️