పేరుకుపోతున్న మురుగునీరు

Dec 25,2023 21:28

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  రోడ్డుకు ఇరువైపులా పెద్ద కాలువలు కట్టేశాం.. పక్కనే ఉన్న కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉంటే మాకేంటి అన్న చందంగా నగర పాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బంది, అధికారుల తీరు ఉంది. గూడ్స్‌ షెడ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు రోడ్డు వెడల్పులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా పెద్ద కాలువలు నిర్మాణం నగరపాలక సంస్థ చేపట్టింది. కాలువల నిర్మాణం చేపట్టారు తప్ప ఆయా వీధుల నుంచి కాలువలు ద్వారా వచ్చే మురుగు నీరు ప్రధాన కాలువల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గణేష్‌ కోవెల ఎదురుగా అమృత టిఫిన్‌ హోటల్‌ వద్ద ప్రధాన కాలువలకు పక్క వీధిలో రెహమాన్‌ డాక్టర్‌ ఇంటి పక్క నుంచి కాలువల ద్వారా మురుగు నీరు పోయేందుకు అనుసంధానం చేయకపోవడంతో ఆయా కాలువలు చిన్నపాటి చెరువును తలపించేలా ఉన్నాయి. మరోవైపు హోటల్‌ యాజమానులు కూడా చెత్త చెదారం కాలువల్లో పడేస్తుండంతో మురుగు నీరు నిల్వ ఉండి కంపు కొడుతోంది. రెహమాన్‌ డాక్టర్‌ ఇంటి చుట్టూ నివాసాల్లో ఉన్నవారు సైతం ఈ దుర్వాసనకు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు దోమలు విపరీతంగా విజృంభిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేకమార్లు మున్సిపల్‌ సిబ్బందికి, అధికారులు తెలిపినా పట్టించుకోవడం లేదని ప్రజాశక్తి వద్ద గోడు వెల్లబోసుకున్నారు. వెంటనే నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

➡️