పోలింగ్‌ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభం

Mar 28,2024 23:02

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. పోలింగ్‌లో పాల్గొనే ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాల విభజనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 1884 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేంద్రాల్లో 1300 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలు 31 వరకు ఉన్నట్టు జిల్లా అధికారులు గుర్తించారు. ఈమేరకు 31 కేంద్రాలు అదనంగా ఏర్పాటుకు ఎన్నికల కమిషన్‌కు జిల్లా అధికారులు ఇటీవల ప్రతిపాదనలు పంపారు. ఎన్నికల కమిషన్‌ అనుమతిస్తే జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 1915కి పెరిగే అవకాశం ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో ఈ తరహా పోలింగ్‌ కేంద్రాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఎక్కువ మంది ఓటర్లు ఉంటే పోలింగ్‌ ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగే అవకాశం ఉండటంతో విభజనకు ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు పోలింగ్‌ సిబ్బందిని ఎంపిక చేసే ప్రక్రియను జిల్లా అధికారులు చేపట్టారు. ఒక్కొకేంద్రంలో ఆరుగురు సిబ్బందితోపాటు 20 శాతం రిజర్వు సిబ్బందితో కలిపి మొత్తం 13900 మంది సిబ్బంది అవసరం అవుతారని అంచనా వేశారు. ఇప్పటి వరకు ఎంపిక చేసిన పోలింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులకు ఏప్రిల్‌ 15న శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. వీరు దాదాపు 4600 మంది వరకు ఉంటారని అంచనా. ఈమేరకు ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేశారు. ఇందుకు నోడల్‌ అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల విధుల దూరంగా ఉండాలని కొంత మంది ఉద్యోగులు యోచిస్తున్నారు. ఈసారి రాజకీయ వత్తిడి ఎక్కువగా ఉంటుందనే భావనలో ఉద్యోగులు ఉన్నారు. ఇందుకోసం విధుల నుంచి తప్పుకోవడం కోసం ఎన్నికల అధికార్లకు వినతిపత్రాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విధులు కేటాయించిన తరువాత కూడా గైర్హాజరైతే ఇబ్బంది లేకుండా ఉండేందుకు 20 శాతం రిజర్వు ఉద్యోగులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. సచివాలయాల్లో పనిచేసే ఎఎన్‌ఎంలు, మహిళా పోలీసులకు పోలింగ్‌ విధులు కాకుండా ఇతర బాధ్యతలు అప్పగించనున్నారు. ఎఎన్‌ఎంలు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద వైద్యశిబిరాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోలింగ్‌ సిబ్బందికి జంబ్లింగ్‌…పోలింగ్‌ సిబ్బందికి కూడా ఎన్నికల విధుల కేటాయింపులో జంబ్లింగ్‌ విధానం అవలంభించనున్నారు. పోలింగ్‌ సిబ్బంది జన్మస్థలం, నివశించే ప్రాంతం ఉన్న నియోజకవర్గంలో వారికి ఎన్నికల విధులు కేటాయించరు. మరొక నియోజకవర్గంలో విధులు కేటాయిస్తారు. అయితే ఈ సారి ఒకే పార్లమెంటు పరిధిలో డ్యూటీలు కేటాయించడం వల్ల జిల్లా పరిధిలోనే తక్కువ దూరంలోనే ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెసులుబాటు ఉంటుందంటున్నారు. గుంటూరులో నివాసం ఉండే వారికి మంగళగిరి, తెనాలి, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాలకు కేటాయించే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాల వారికి గుంటూరులోని పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రతి ఉద్యోగి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

➡️