మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Jun 24,2024 21:51

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  మున్సిపల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, డిఇఒలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, ప్లాంటేషన్‌, రెవెన్యూ, అటెండర్‌లు, పార్కుల్లో, ఆఫీస్‌లో పనిచేసే సిబ్బందికి అర్హత, సినియార్టీ ప్రకారం స్కిల్‌, సెమీ స్కిల్‌, అన్‌ స్కిల్‌ వేతనాలు, రిస్క్‌ అలవెన్స్‌ చెల్లించాలని కోరుతూ సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌కు ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యునియన్‌ నాయకులు వినతినిచ్చారు. సంక్రాంతి కానుక వెయ్యిరూపాయలు చెల్లించాలని, రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. గత ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ 75 వేల తో పాటు 10 సంవత్సరాల సర్వీస్‌ పైబడిన వారికి సంవత్సరానికి రూ.2వేలు చొప్పున అదనంగా చెల్లించాలని కోరారు. రెగ్యులర్‌ ఉద్యోగుల ఖాళీ ల్లో అర్హతను బట్టి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. విజయనగరం నగర పాలక సంస్థలో థర్డ్‌ పార్టీ విధానం రద్దు చేయాలని, పంపు హౌస్‌ కార్మికులకు మెన్‌, మెటీరియల్‌ వేరు చేయాలని, బకాయి జీతాలు చెల్లించాలని కోరారు. వినతిచ్చిన వారిలో యూనియన్‌ నాయకులు ఎ.జగన్మోహన్‌రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకర్రావు తదితరులు ఉన్నారు.

గ్రీవెన్సుకు 192 వినతులు

విజయనగరంకోట : కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వ్యవస్థకు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 192 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఆర్‌డిఒ సూర్యకళ , డిప్యూటీ కలెక్టర్లు మురళీ కృష్ణ, రాజేశ్వరి, నూకరాజు తదితరులు వినతులు స్వీకరించారు. రెవిన్యూ శాఖ సమస్యలపై 135, డిఆర్‌డిఎకు సంబంధించి 29, జిల్లా పంచాయతీ శాఖకు 9, విద్యా శాఖకు 9, జిల్లా ఆసుపత్రులకు సంబంధించి 8, మున్సిపల్‌ శాఖకు 2 చొప్పున వినతులు అందాయి.

కమిషర్‌ వినతులు స్వీకరణ

విజయనగరం టౌన్‌ : నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వ్యవస్థకు 5 వినతులు వచ్చాయి.వినతులు స్వీకరించిన కమిషనర్‌ ఎంఎం నాయుడుకు వాటి పరిష్కారానికి సంబంధిత విభాగ అధికారులకు కమిషనర్‌ ఆదేశించారు. హౌసింగ్‌ సంబంధించి ఒకటి, ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి రెండు, శానిటేషన్‌కు సంబంధించి రెండు, వాలంటీర్ల రాజీనామా సంబంధించి రెండు వినతులు అందాయి. 41 డివిజన్‌ 49 వ నెంబర్‌ సచివాలయ పరిధిలో అనధికార సభ్యులు సచివాలయంలోకి ప్రవేశించి సిబ్బందితో సమీక్ష చేయడం విరుద్ధమంటూ విచారణ జరిపించాలని బొంగ భానుమూర్తి వినతి అందజేశారు. కార్యక్రమంలో ఎసిపి అమ్మాజీ రావు, ఇఇ కె.శ్రీనివాసరావు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️