పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలను కల్పించండి

పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలను

– జాయింట్‌ కలెక్టర్‌ భావనా వశిష్ట ఆదేశాలు

ప్రజాశక్తి -పాడేరు: పోలింగ్‌ కేంద్రాలకు విద్యుత్‌, మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస వసతులను సమకూర్చాలని జాయింట్‌ కలెక్టర్‌ భావనా వశిష్ట ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పాడేరు నియోజకవర్గ తాహశీల్దారులు, సెక్టార్‌ అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలలో సౌకర్యాలపై కచ్చితమైన సమాచారం అందించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలు కింది అంతస్తులోనే ఉండాలని, మరుగుదొడ్లు లేకుంటే కొత్తవి నిర్మాణం చేపట్టాలని, దానికి రూ.20 వేలను కేటాయించి, రూ.10వేలను అడ్వాన్స్‌గా ఇచ్చి పనులు చేయించాలని, పూర్తయిన తర్వాత మిగతామొత్తం చెల్లించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల పైకప్పులు సక్రమంగా లేక పోతే మరమ్మతులు చేయడానికి నిధులు ఇస్తామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెలుతురు ఉండే విధంగా విద్యుత్తు సౌకర్యం కల్పించాలని స్పష్టం చేసారు. పోలింగ్‌ సిబ్బంది రవాణాకు అవసరమైన బస్సులు, జీపులకు సెక్టార్‌ అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారని, ఆయా రూట్లలో బస్సులు జీపులు వెళ్లడానికి అనుకూలంగా ఉన్నది లేనిది పరిశీలించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాలకు రెండు వందల మీటర్ల దూరంలో రాజకీయ పార్టీల కార్యాలయాలు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి.అంబేద్కర్‌ ఉన్నారు.

➡️