పోలింగ్‌ నిర్వహణలో పిఒ పాత్ర కీలకం

Mar 27,2024 21:03

ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల్లో పిఒల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అన్నారు. ఒక్క తప్పు కూడా చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం ఎన్నికల ప్రక్రియ, విధులు, ఇవిఎంలు, వివి ప్యాట్ల పనితీరుపై సంపూర్ణ అవగాహన ఉండాలని సూచించారు. వివిధ నియోజకవర్గాల నుంచి మాస్టర్‌ ట్రైనీలుగా ఎంపికైన ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం శిక్షణ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల పనితీరు, పిఒలు, ఎపిఒల విధులు, బాధ్యతలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఎన్నికల కమిషన్‌ రూపొందించిన వీడియోను ప్రదర్శించి అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, పోలింగ్‌ రోజున, సంబంధిత పోలింగ్‌ బూత్‌లో పిఒదే సర్వాధికారమని చెప్పారు. అందరి విధులపైనా పిఒలకు అవగాహన ఉండాలని సూచించారు. రీ పోలింగ్‌కు ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని, ఎట్టి పరిస్థితిలోనూ తప్పులు, పొరపాట్లు జరగకూడదని స్పష్టం చేశారు. వీలైనంత వరకు వేగంగా పోలింగ్‌ పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ఖచ్చితంగా అమలుచేయాలని ఆదేశించారు. తమ వ్యక్తిగత అభిప్రాయాలను, అభిమానాన్ని ఎక్కడా ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. పోలింగ్‌కు 90 నిమిషాల ముందే మాక్‌ పోల్‌ నిర్వహించాలని చెప్పారు. హ్యాండ్‌ బుక్‌, చేయాల్సిన, చేయకూడని జాబితా, చెక్‌ లిస్ట్‌ లను తమతో పాటు ఉంచుకోవా లన్నారు. ముందురోజు రాత్రే తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 5.30కే మాక్‌ పోల్‌ జరుగుతుంది కాబట్టి, ముందురోజు రాత్రే బూత్‌లో ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. మొత్తం మూడుదశల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సహాదిత్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ట్రైనింగ్స్‌ నోడల్‌ ఆఫీసర్‌ సుధాకర రావు, ఆర్‌ఒలు ఎంవి సూర్యకళ, బి.శాంతి, బి.సాయిశ్రీ, నూకరాజు, మురళీకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు, ఎన్నికల సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.ఏప్రిల్‌ 14 లోగా ఓటు కోసం దరఖాస్తు ఏప్రిల్‌ 14వ తేదీ లోగా కొత్తగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను 25వ తేదీలోగా పరిశీలించి, అర్హులైనవారికి ఓటుహక్కు కల్పిస్తామని తెలిపారు. ఏప్రిల్‌ 14 తరువాత కూడా ఓటుకోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని పరిశీలించి ఓటుహక్కు కల్పించేందుకు పరిపడా సమయం ఉండదని ఆమె స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబర్‌లో బుధవారం కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. ఈ వారంలో వచ్చిన దరఖాస్తుల వివరాలను కలెక్టర్‌ వెల్లడించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు చేసే ఖర్చు అంతా పార్టీ ఖాతాలోకి వెళ్తుందని, నామినేషన్లు వేసిన తరువాత అభ్యర్ధుల ఖాతాలో లెక్కిస్తారని చెప్పారు. ర్యాలీలు, ప్రదర్శనలు, ఇంటింటి ప్రచారం, పాంప్లేట్ల పంపిణీకి కూడా అభ్యర్థులు సంబంధి ఆర్‌ఒల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రెండుమూడు రోజులకు ముందే ధరఖాస్తు చేయాలని, వీలైనంత త్వరగా అనుమతులు జారీ చేస్తామని చెప్పారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఓ ఎస్‌డి అనిత, ఆర్‌ఒలు మురళీకృష్ణ, నూకరాజు, ఎన్నికల విభాగం సూపరింటిండెంట్‌ ప్రభాకర్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️