పోలీసు స్టేషన్‌లోఅంగన్వాడీల బైఠాయింపు

Jan 4,2024 22:06

ప్రజాశక్తి-భోగాపురం  :  మహిళా పోలీస్‌ తమ పట్ల అనుచిత వాఖ్యలు చేసినందున క్షమాపణలు చెప్పాలంటూ అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు కృష్ణవేణి ఆధ్వర్యంలో అంగన్వాడీలు స్థానిక పోలీసు స్టేషన్‌లో బైఠాయించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండలంలోని ఎ.రావివలస పంచాయితీలో అక్కడ వైసిపి నాయకుల ఆదేశాలతో గురువారం కార్యకర్తలు కేంద్రాలను తెరిచారంటూ సమ్మెలో ఉన్న అంగన్వాడీలకు తెలిసింది. దీంతో అమకాం, కొయ్యవానిపాలెం గ్రామాలకు వెళ్లి కేంద్రాలను తెరవవద్దని అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు కృష్ణవేణితో సహా పలువురు హెచ్చరించారు కేంద్రాలు తెరిచి సమ్మెను నాశనం చేయవద్దని కోరారు. సచివాలయ సిబ్బంది సమాచారంతో అక్కడికి వచ్చిన మహిళా కానిస్టేబుల్‌కు, యూనియన్‌ నాయకులు కృష్ణవేణికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్‌ అనుచిత వాఖ్యలు చేయడంతో కృష్ణవేణితో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బైఠాయించారు. క్షమాపణలు చెప్పేవరకు ఇక్కడ నుంచి కదలబోమని కూర్చొన్నారు. ఇంతలో సిఐ బివి వెంకటేశ్వరరావు, ఎస్‌.ఐ కృష్ణమూర్తి వచ్చి ఇలా స్టేషనులో బైఠాయించడం సరికాదని అన్నారు. క్షమాపణలు చెప్పేంత వరకు వెల్లేదిలేదని అంగన్‌వాడీలు చెప్పడంతో పోలీసులకు, కృష్ణవేణికి మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు అంగన్‌వాడీలు స్టేషను నుంచి బయటకు వెళ్లకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కొంతసేపు గేటు వేశారు. ఈ నేపథ్యంలో సిఐటియు నాయకులు బి.సూర్యనారాయణ వచ్చి సిఐతో మాట్లాడారు. సమ్మెకు సహకరించాలని కోరి ఆందోళన విరమించారు. అంగన్‌వాడీ కేంద్రాలను తానే తెరవాలని ఒత్తిడి తెచ్చినట్లు అంగన్‌వాడీలు ఆరోపించడం సరికాదని ఆ పంచాయితీ సర్పంచ్‌ ఉప్పాడ శివారెడ్డి అన్నారు. అందులో తనకు ఎటువంటి సంబంధంమూ లేదని, తాను ఎవరినీ ఒత్తిడి చేయలేదని అన్నారు.

➡️