పోస్టల్‌ బ్యాలెట్‌ చాలా కీలకం : కలెక్టర్‌

Feb 6,2024 21:12

 ప్రజాశక్తి-విజయనగరం  :  ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్‌ బ్యాలెట్లు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల తయారీ, జారీ, స్వీకరణలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా రాకూడదని స్పష్టం చేశారు. అన్ని దశల్లో ఎన్నికల కమిషన్‌ నిర్ధేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. ఎన్నికల శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా, పోస్టల్‌ బ్యాలెట్లకు సంబంధించిన అంశాలపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం జరిగింది. పోస్టల్‌ బ్యాలెట్లకు సంబంధించి జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనీలుగా ఎంపికైన డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, జిల్లా బిసి సంక్షేమాధికారి కె.సందీప్‌ కుమార్‌ శిక్షణ ఇచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల తయారీ, ఓటింగ్‌, కౌంటింగ్‌, ఫెసిలిటేషన్‌ సెంటర్‌ సిబ్బంది నియామకం, ఇంటివద్దే ఓటింగ్‌ తదితర అంశాల గురించి వీరు వివరించారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, గత ఎన్నికలతో పోలిస్తే, ప్రస్తుత ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లు, ఓటింగ్‌, కౌంటింగ్‌ విధానాల్లో పలు మార్పులు వచ్చాయని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాల్లో ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయని, వీటిని పూర్తిగా అర్ధం చేసుకోవాలని సూచించారు. గతంలో సర్వీసు ఓటర్లు, ఎన్నికల విధుల్లో ఉన్న వారికి మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేసేవారని చెప్పారు. ప్రస్తుతం వీరితోపాటు ఆబ్సెంట్‌ ఓటర్ల విధానం కూడా కొత్తగా వచ్చిందని తెలిపారు. దీనిలో భాగంగా వయసు 80 సంవత్సరాలు దాటినవారు, 40 శాతం పైబడి వికలాంగత్వం ఉన్న విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్‌ వ్యాధిగ్రస్తులు, అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకొనే అవకాశం కల్పించారని తెలిపారు. వీరు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ముందుగా దరఖాస్తు చేసుకుంటే, నిర్ధేశించిన ప్రక్రియ ప్రకారం వాటిని జారీ చేయాల్సి ఉంటుందన్నారు. వృద్దులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్‌ వ్యాధిగ్రస్తులు తాము ఇంటివద్దనుంచే ఓటు వేస్తామని కోరితే, ఆ మేరకు ప్రత్యేక పోలింగ్‌ బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించేందుకు అవసరమైతే ప్రత్యేక కౌంటింగ్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. సర్వీసు ఓటర్లకు మాత్రం ఆన్‌లైన్‌ ద్వారా బ్యాలెట్‌ పత్రం పంపబడుతుందని, వీరు ఓటు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. వీరి బ్యాలెట్‌ పత్రాలపై అభ్యర్ధుల పేర్లు, ఫొటోలు, పార్టీలు మాత్రమే ఉంటాయని, పార్టీ గుర్తులు మాత్రం ఉండవని వివరించారు. ప్రతీ బ్యాలెట్‌ పత్రంపైనా ఆఖర్లో నోటా తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని, అందువల్ల ప్రతీఒక్కరూ అప్రమత్తంగా విధులను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ మేరకు సిబ్బందికి శిక్షణ ఇచ్చి, వివిధ అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని మాస్టర్‌ ట్రైనీలను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, మెప్మా పీడీ సుధాకరరావు, ఎన్నికల విభాగం సూపరింటిండెంట్‌ ప్రభాకర్‌, మాస్టర్‌ ట్రైనీలు, వివిధ నియోజకవర్గాల నుంచి డిప్యుటీ తాహశీల్దార్లు పాల్గొన్నారు.

➡️