ప్రజావ్యతిరేక భూ హక్కు చట్టం రద్దు చేయాలి

Jan 12,2024 21:22

మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్న న్యాయ వాదులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు లీగల్ ః గత 22 రోజులుగా ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టం రద్దు చేయాలని గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి, నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు బార్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు శుక్రవారం స్థానిక నగరంపాలెం, గుర్రం జాషువా విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకూ భూ వివాదాలను స్వయంప్రతిపత్తి కలిగిన, సంపూర్ణ న్యాయపరిజ్ఞానం కలిగిన న్యాయస్థానాలు మాత్రమే తీర్పులు ఇస్తున్నాయని, కానీ నూతన చట్టంలో రెవెన్యూ అధికారులు మాత్రమే భూమి శాశ్వత యాజమాన్య హక్కును నిర్ణయించటం న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ చట్టం ప్రకారం ఆస్థి యజమాని మరణిస్తే వారసుడు ఎవరనేది రెవెన్యూ అధికారులే నిర్ణయించటం, కోర్టును ఆశ్రయించే హక్కు బాధితుడికి కాక, రెవెన్యూ అధికారుల అనుమతిస్తేనే కోర్టుకు పంపటం సరికాదన్నారు. రాజ్యాంగ పరంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్తే ఆస్థి వివాదాలకు దీప స్థంబంలాగా ఉండాలని, రెవెన్యూ అధికారులను న్యాయాదిపతుల్ని చేసే ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. తక్షణమే నూతన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షఁలు కెవికె సురేష్‌, ఉద్యమ కమిటీ నాయకఁలు, టిడిపి నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్‌, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు కోవెలమూడి రవీంద్ర, నసీర్‌ అహ్మద్‌, ప్రత్తిపాడు ఇన్‌చార్జి బి.రామాంజనేయులు, టిడిపి నాయకులు నిమ్మల శేషయ్య, జనసేన రాష్ట్ర నాయకులు బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌, వివిధ పార్టీల లీగల్‌ సెల్స్‌ అధ్యక్ష, కార్యదర్శులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ,

➡️