ప్రజాసంక్షేమమే వైసిపి ప్రభుత్వ ధ్యేయం

రెల్లిగడ్డలో హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌ ప్రారంభిస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎంపీ చింతా అనురాధ

ప్రజాశక్తి-అమలాపురం

ప్రజా సంక్షేమమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమనిరాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిధిలో తూర్పులంక, గోడి, రెల్లిగడ్డ గ్రామాల్లో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమాలు ఎంపీ చింతా అనురాధ, మంత్రి పినిపే విశ్వరూప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రధాన రోడ్లన్నీ చాలా వరకు పూర్తి చేశామన్నారు. ఈనెల 19నన విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ ను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను వివిధ స్థాయిలో ఈనెల 18వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో ముందస్తుగా సామాజిక సమతా సంకల్పం జన భగీదరి పలు కార్యక్రమాలు విస్తతంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాల స్థాయిల్లో జరిగిన సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో పౌరులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారన్నారు. రాజ్యాం గంలోని రాజ్యాంగ పీఠిక ఉపోద్ఘాతంతో ప్రతిజ్ఞ చేస్తూ ఫ్లెక్సీ బ్యానర్‌ పై సంతకాలు చేశారన్నారు. ఈనెల 19న అంబేద్కర్‌ అభిమానులు విజయవాడ విచ్చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ చింతా అనురాధ మాట్లాడుతూ త్వరలో అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి వాటర్‌ గ్రేడ్‌ పథకం ద్వారా తాగునీరు సరఫరా కానున్నదని చిట్ట చివరి గ్రామాలకు సవ్యంగా సరఫరా అయ్యే రీతిలో సిఎస్‌ఆర్‌ నిధులను వినియోగించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఒఎన్‌జిసి ద్వారా స్థానిక ప్రజానీకం అవసరాలను తీర్చడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఓఎన్జిసి కాకినాడ వారు సిఎస్‌ఆర్‌ నిధులైన రూ.25 కోట్లతో పేరూరు-ఓ డలరేవు రోడ్డు నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్న అన్నారు. మంత్రి విశ్వరూప్‌, ఎంపీ చింతా అనురాధ తొలుతుగా మండల పరిధిలోని తూర్పులంక గ్రామంలో ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేశారు. తదుపరి రెల్లిగడ్డ గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని వారు ప్రారంభించారు. అనంతరం అదే గ్రామంలో షెడ్యూల్‌ కులాల కమ్యూనిటీ హాలుకు భూమి పూజ చేశారు. అనంతరం గోడిలో ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శంకు స్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్‌, జెడ్‌పిటిసి సభ్యుడు కె.గౌతమి, ఎంపిపి ఐ.శేషారావు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️