ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌కు నిరసనగా రాస్తారోకో

Dec 22,2023 21:18

 ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌  :  పార్లమెంటు ఉభయసభల్లో 141 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యాన శుక్రవారం స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సు జంక్షన్‌లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, ఆమ్‌ ఆద్మీ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌.రమేష్‌ మాట్లాడారు. బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం మరుగున పడిందని, బిజెపి ప్రభుత్వం రామరాజ్యం పేరు చెబుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు. పార్లమెంట్‌లో బిజెపి ఎంపి ప్రోత్సాహంతో ఇద్దరు యువకులు స్మోక్‌ కలర్‌ ఘటనకు పూనుకున్నారని, ఈ ఘటనపై అమిత్‌ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నిస్తే 141 మందిని సస్పెండ్‌చేయడం సిగ్గు చేటని అన్నారు. పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య యుతంగా నిర్వహించ కుండా మోడీ స్వామ్యంతోనే నడిపిస్తున్నారని తెలిపారు. పార్లమెంట్‌ లోనే భద్రత లేకపోతే దేశానికి ఏం భద్రత ఉంటుందని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం ఇదే రకమైనటువంటి వైఖరితో కొనసాగితే దేశానికి ముప్పని అన్నారు. దేశం యావత్తు దీనిని ఖండించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌. శంకర్రావు, జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ, ఎ.జగన్మోహన్‌, సిపిఐ నాయకులు బి.అశోక్‌, రంగరాజు, కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డోల శ్రీనివాస్‌, మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షులు షరీఫ్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల : ప్రతిపక్ష ఎంపిలను బహిష్కరించడం దుర్మార్గమని వామ పక్ష నాయకులు కిల్లంపల్లి రామారావు, మొయిద పాపారావు అన్నారు. ఎంపిల బహిష్కరణకు నిరసనగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక మొయిద జంక్షన్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార బిజెపి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కడానికిఎంపిలను బహిష్కరించడం దుర్మార్గమని అన్నారు.

➡️