ప్రభుత్వ భూములను పేదలకు పంచండి – ధర్నాలో వ్య.కా.స జిల్లా కార్యదర్శి అన్వేష్‌

ప్రజాశక్తి-పోరుమామిళ్ల మండలంలోని అక్కల్‌రెడ్డిపల్లె కపానగర్‌లో భూమిలేని పేదలందరికీ ప్రభుత్వం భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి.అన్వేష్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కల్‌రెడ్డిపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్‌ 1853 1854లో ప్రభుత్వ భూములు దాదాపు 500 ఎకరాలు ఉన్నాయన్నారు. భూమిలేని పేదలందరికీ మూడు ఎకరాలు చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కలెక్టర్‌, బద్వేలు ఆర్‌డిఒ, తహశీల్దార్‌కు భూమిలేని పేదలందరూ అర్జీలు పెట్టించామన్నారు. ప్రభుత్వం, రెవెన్యూ ఉన్నతాధికారులు భూ పంపిణీ చేపట్టకపోవడం భూమిలేని నిరుపేదలందరికీ నిర్లక్ష్యం చేయటం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ భూములు అక్రమంగా దౌర్జన్యంగా అనర్హుల వందల ఎకరాలు సాగు చేస్తున్న రెవెన్యూ అధికారులు వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాల నుంచి పేదలకు అసైన్మెంట్‌ కమిటీ ద్వారా భూ పంపిణీ చేయకుండా టిడిపి, వైసిపి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని పేర్కొన్నారు. అనంతరం విఆర్‌ఒ జహీర్‌బాషాకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్‌, సగిలి గురవయ్య, ఎన్‌.వీరయ్య, కెవిపిఎస్‌ నాయకులు ప్రవీణ్‌, సుదర్శన్‌, అక్కల్‌రెడ్డిపల్లె గ్రామ నాయకులు ఆరోగ్యం, రామయ్య, అల్లూరయ్య, కిషోర్‌, లక్ష్మమ్మ, జయమ్మ, కుమారి పాల్గొన్నారు

➡️