ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : జెసి

ప్రజాశక్తి-సంబేపల్లె (రాయచోటి) స్థానిక సమస్యలకు సత్వర పరిష్కారమే మండల స్థాయి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమమని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. శుక్రవారం సంబేపల్లి ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం లబ్ది అందిస్తోందన్నారు. గ్రామ స్థాయిలో చిన్న చిన్న అంశాలు ఏవైనా జిల్లా అధికారుల దష్టికి రానివి జిల్లా కేంద్రానికి రాలేని వారి కొరకు మండల స్థాయిలోనే జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి బుధ, శుక్రవారం ఒక్కొక్క మండల కేంద్రంలో జగనన్నకు చెబుదాం మండల స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, మండల అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున ప్రజలకు అవసరమైన అన్ని సేవలు సులభంగా అందించే అవకాశం ఏర్పడుతుందన్నారు. మండల స్థాయిలో వచ్చిన స్థానిక సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపే అవకాశం ఉందని, సచివాలయాల పరిధిలో కూడా ఏవైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే మండల స్థాయి స్పందన కార్యక్రమంలో తెలియజేయవచ్చునున్నారు. కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి జెసి ఫర్మాన్‌ అహ్మదఖాన్‌, ఆర్‌డిఒ రంగస్వామి అర్జీలు స్వీకరించి పరిష్కారం కొరకు వాటిని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు ఎండార్స్‌ చేసి సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో 35 దరఖాస్తులు అందాయని, వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి ప్రజలు సంతప్తి చెందేలా కాల పరిమితిలోపు నాణ్యతగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ మహేశ్వరి, ఎంపిపి నాగ శ్రీలక్ష్మి, ఎంపిడిఒ నరసింహం, వివిధ శాఖల జిల్లా అధికారులు, సర్పంచ్‌ రామచంద్ర, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

➡️