ప్రశాంత ఎన్నికలకు సహకరించండి : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ రాజకీయ పార్టీ నాయకులను కోరారు. బుధవారం కలెక్టరేట్‌ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీ నాయ కులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎంసిసి వైలేషన్స్‌ జరిగినట్లయితే వెంటనే తమ దష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని ప్రతి ఒక్కరూ ఎంసిసి నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు చేయడం, రెచ్చగొట్టేలా రాజకీయనేతలు ప్రవర్తించకూడదన్నారు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదన్నారు. అనుమతి లేకుండా బ్యానర్లు కట్టడం, లౌడ్‌ స్పీకర్లు ఏర్పాటు చేయడం, డబ్బులు పంపిణీ చేయడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించకూడదని సూచించారు. ఎన్నికల నిర్వహణ అధికారులు సివిజిల్‌ ద్వారా అందే ఫిర్యాదులపై తక్షణం స్పందించి సకాలంలో సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఎన్నికల సంఘం రూపొందించిన సి – విజిల్‌, నో యువర్‌ కాండిడేట్‌, ఓటర్‌ హెల్ప్‌ లైన్‌, వంటి యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, వాటి ద్వారా చాలా సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి పోలింగ్‌ సిబ్బందికి పోలింగ్‌ మెటీరియల్‌ అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతిరోజు వార్తా పత్రికలలో వచ్చే అడ్వర్స్‌ న్యూస్‌ పై అధికారులు వెంటనే స్పందించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపిడిఒలు ఎంసిసి వై లైసెన్స్‌ జరగకుండా పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అన్నారు. రిటర్నింగ్‌ అధికారులు పోలీస్‌ చెక్‌ పోస్ట్‌ లను తరచూ తనిఖీ చేస్తూ ఉండాలని ప్రతి చెక్‌ పోస్ట్‌ నందు వీడియోగ్రఫీ చేయించాలని పేర్కొన్నారు. నామినేషన్లు స్వీకరణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నామినేషన్‌ జరిగే సమయంలో వీడియో గ్రఫీ, ఫొటో గ్రఫీ తప్పక చేయించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ఖాన్‌, ఎఎస్‌పి డాక్టర్‌ రాజ్‌కమల్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లి, రాజంపేట ఆర్‌డిఒలు రంగస్వామి, హరిప్రసాద్‌, మోహన్‌రావు, ఆర్‌ఒలు, నోడల్‌, అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️