ప్రాణం తీసిన విద్యుత్‌ తీగ

Jan 31,2024 21:51

ప్రాణం తీసిన విద్యుత్‌ తీగ
అడవి జంతువుల కోసం వేసిన ఉచ్చుకు యువకుడు బలి
మరొకరికి తీవ్రగాయాలు
భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు
ప్రజాశక్తి- సోమల:
మండలం ఆవుల పల్లె పంచాయతీ దేవల కుప్పం గ్రామం యానాది కుటుంబానికి చెందిన గణపతి(21) అనే యువకుడు అడవి జంతువుల కోసం అక్రమంగా తీసిన విద్యుత్‌ తీగకు తగిలి అక్కడికక్కడే మతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుడిని కాపాడేందుకు ప్రయత్నించగా మరో వ్యక్తి తీవ్ర గాయాలు కాగా వారితో ఉన్న బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. మతుడి భార్య నాగవేణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకట నరసింహులు తెలిపారు. వివరాల్లోకి వెళితే యానాది కుటుంబానికి చెందిన గణపతి, సిద్ధయ్య, ఈశ్వరయ్య ముగ్గురు మంగళవారం సాయంత్రం కూలి పనులు ముగించుకుని ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందిన చందు అనే వ్యక్తి తాను అడవికి గొర్రెలు మేపుకొని వెళ్లగా వాటిలో కొన్ని ఇంటికి రాలేదని వెళ్లి గొర్రెల కోసం వెతుకుదామని ముగ్గురిని పిలిచాడు. ముగ్గురు కలిసి సుందరనాయుడు మామిడి తోట వైపు గొర్రెలను వెతికేందుకు వెళ్లారు. అడవి పందులను చంపడానికి అక్రమంగా పొలంలో తీసిన విద్యుత్‌ వైర్లు గమనించకుండా గణపతి ముందుకు వెళ్లడంతో వైర్లు తగులుకొని కరెంట్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే పడిపోయాడు. విషయం గమనించిన సిద్ధప్ప గణపతిని కాపాడేందుకు వెళ్లి తను కూడా కరెంట్‌ షాక్‌కు గురై పక్కకు పడిపోయాడు. ఇది గమనించిన ఈశ్వర వెంటనే గ్రామంలోని వారికి ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని తెలిపి వెంటనే వీరిని కాపాడేందుకు రావాలని కోరాడు. హుటాహుటిన గ్రామంలోని కొందరు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోలో పెద్ద ఉప్పరపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. హాస్పిటల్‌ వద్దకు చేరుకోగానే గణపతి మతి చెందగా ఈశ్వరయ్యకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం సదుం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదులో తనది గంగవరం మండలం కీలపట్ల గ్రామం అని, తనకు నాలుగు నెలల క్రితం తన తల్లిదండ్రులు గణపతితో వివాహం జరిపించారని, పారాణి ఆరకముందే తన భర్త అసువులు బాసాడని ఇందుకు కారణమైన వారికి పై కఠినచర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఎడవల్లి మల్లికార్జున మామిడి తోపులో ఉన్న ట్రాన్స్ఫార్మర్‌ నుండి ఎడవలి సుధాకర్‌ నాయుడు, ఎడవలి మల్లికార్జున నాయుడు, గుత్తా సుందరనాయుడు, చంద్ర నాయుడు వీరు తీసిన అక్రమ విద్యుత్‌ వైర్‌ కారణంగా తన భర్త మతి విద్యుత్‌ షాక్‌ గురై చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. విద్యుత్‌ శాఖ పర్యవేక్షణ లోపం.. ఆవులపల్లి పంచాయతీ దేవలకుప్పం యానాది వాడకు చెందిన గణపతి విద్యుత్‌ షాక్‌కు గురై బుధవారం మరణించిన సంఘటనలో విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం కారణంగా తెలుస్తోందని ప్రజలు అంటున్నారు. ఇదే ప్రాంతంలో గతంలో ఎందరో ఇలా అక్రమ విద్యుత్‌ కనెక్షన్లు తీయడం వల్ల వాటిని తగులుకొని అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటనలు ఉన్నాయి. జరిగిన వాటి నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యుత్‌ శాఖ అధికారులు పర్యవేషణ లోపం కారణంగా మరింత మంది ప్రాణాలు బలిగొనేందుకు తావిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో అక్రమ విద్యుత్‌ కనెక్షన్లు వాడటం వల్ల జరిగే ప్రమాదాలు అలా అక్రమ విద్యుత్‌ కనెక్షన్లు తీస్తే తీసుకునే చర్యలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తే ఇలాంటివి మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా నివారించే అవకాశం ఉంది. కానీ అలాంటివేవీ లేకుండా నిమ్మకు నీరు ఎత్తినట్టుగా విద్యుత్‌శాఖ వ్యవహరిస్తుండడంతో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఇకనైనా విద్యుత్‌ శాఖ వారు గ్రామాలలో ప్రజలను చైతన్య పరిచే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. రూ.25లక్షలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలిసిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు సోమల మండలం ఆవులపల్లి పంచాయతీ చిన్న దేవల కుప్పం గ్రామానికి చెందిన యానాది కాలనీ నివాసి గణపతి(21) అడవి పందులను చంపేందుకు పంట పొలాలలో తీసిన అక్రమ విద్యుత్‌ కనెక్షన్‌ కారణంగా మతి చెందాడని అతడి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల నష్టపరిహారాన్ని అందజేసి అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం పర్యవేషణ లోపం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనకు తక్షణం స్పందిస్తూ మతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి: ఎమ్మార్పీఎస్‌ విద్యుత్‌ షాక్‌కు గురై మతి చెందిన గణపతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని, మృతుని కుటుంబానికి రూ.50లక్షల నష్టపరిహారాన్ని అందజేయాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందజేయాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. పెద్ద ఉప్పరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంఆర్పిఎస్‌ మండల అధ్యక్షులు ప్రకాష్‌, నాయకులు మొగిలిశ్వరయ్య, ప్రభు, లక్ష్మీపతి పాల్గొన్నారు.

➡️