ప్రాతూరు సొసైటి లంక భూముల హక్కుదారులకు పట్టాలివ్వాలి

Jan 14,2024 23:26

సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య
ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ :
ప్రాతూరు సొసైటీ లంక భూముల హక్కుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టాలివ్వాలని రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కుంచనపల్లి ఎస్సీ కాలనీలో ప్రాతూరు సొసైటీ లంక భూముల హక్కుదారుల సమావేశం రైతు సంఘం నాయకులు ఎ.రంగారావు అధ్యక్షతన శనివారం రాత్రి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త భూ హక్చు చట్టం వల్ల ప్రజలు తమ భూములపై హక్కు కోల్పోయి, తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాతూరు సొసైటీ లంక భూములను హక్కుదారులైన దళితులు సాగు చేసుకునేందుకు వీలుగా లంక భూములను సర్వే చేసి, పట్టాలివ్వాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ కుంచనపల్లి, పాతూరు గ్రామాల్లో లబ్ధిదారులైన కౌలు రైతులు ఒక్కో ఎకరం కౌలుకు తీసుకునేందుకు రూ.60 వేల నుండి రూ.లక్ష వరకు భూ యజమానులకు కౌలు చెల్లిస్తున్నారని తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న దళిత రైతులకు ప్రాతూరు సొసైటీ లంక భూములను సర్వే చేసి, లబ్ధిదారులైన దళితులకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు డి.వెంకటరెడ్డి, ఎ.రామారావు, కౌలురైతు సంఘం మండల క్యాదర్శి పి.కృష్ణ, ఐద్వా మండల కార్యదర్శి కె.యశోద, ఎన్‌.శివపార్వతి, లంక భూముల రైతులు బి.పాల్‌, కె.మహేశ్వరరావు, కె.జాన్‌, ఎన్‌.మత్తయ్య, ఎం.భాస్కరరావు, దేవ కరుణ, ఎస్‌.మరియమ్మ, ఎన్‌.మ్యాచ్‌పాల్‌ పాల్గొన్నారు.

➡️