బకాయిల కోసం నేటి నుండి నిరసనలు

Jan 19,2024 01:13

మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గురువారం స్థానిక బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిల కోసం నేడు తాలూకా కేంద్రాల్లో, 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జనవరి 31 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ జిల్లా కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ పోరాటం ఫలితంగా పిఎఫ్‌ బకాయిలు చెల్లించారని, మిగిలిన బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. 12వ పిఆర్‌సి అమలులోపు 30 శాతం ఐఆర్‌ ప్రకటించి అమలు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా ప్రభుత్వం సంఘాలపై నిర్భంధం ప్రయోగించటం సరికాదన్నారు. సమావేశాలు, సదస్సులకు కూడా ప్రభుత్వం అనుమతివ్వకపోవటం, యాక్ట్‌ 30 అమలులో ఉందని నిరాకరించటం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారికి రావాల్సిన హక్కుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా అనుమతి ఇవ్వట్లేదన్నారు. అధికారంలోకి వస్తే వారంలో సిపిఎస్‌ రద్దు చేస్తామని వాగ్దానం చేసి, నాలుగున్నరేళ్లుగా నాన్చి ఇప్పుడు జిపిఎస్‌ తెచ్చారని, సిపిఎస్‌కు జిపిఎస్‌కు తేడా లేదని విమర్శించారు. ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ పేరుతో అన్ని రాజకీయ పార్టీలతో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యకు జీవో 117 ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. 3, 4, 5 తరగతుల్ని హైస్కూల్స్‌లో విలీనం చేయటం ద్వారా ఏం సాధించారో చెప్పాలన్నారు. పాఠశాలల మూతపడ్డాయిన, ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగిందని, ముఖ్యంగా విద్యార్థుల డ్రాపౌట్స్‌ పెరిగాయని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో దాదాపు 20వేల ఫోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీకి తక్షణమే డిఎస్‌సి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సహాధ్యక్షులు ఎ.ఎన్‌.కుసుమకుమారి మాట్లాడుతూ పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జనవరి 25న రాష్ట్ర కేంద్రంలో ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు పి.వి.శ్రీనివాస్‌, సహాధ్యక్షులు ఎఎల్‌.శివపార్వతి, కోశాధికారి ఎమ్‌డి.గయాసుద్దౌలా, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.ఆదినారాయణ, కె.సాంబశివరావు, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందయ్య, టి.ఆంజనేయులు, యు.రాజశేఖర్‌, జి.వి.ధనలక్ష్మి, కె.ధర్నాద్‌, ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️