బకాయి జీతాలివ్వాలని గ్రీన్‌ అంబాసిడర్ల ధర్నా

Feb 21,2024 21:28

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : 12 నెలలుగా బకాయి ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన బుధవారం కలెక్టరేట్‌ వద్ద గ్రీన్‌ అంబాసిడర్లు ధర్నా చేపట్టారు. ముందుగా స్థానిక సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఆర్‌ఒ కేశవ నాయుడుకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు జె.గౌరి, టి.అశోక్‌, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ మన్యం జిల్లాలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లకు ప్రతి నెలా జీతాలు చెల్లించడం లేదన్నారు. 2 నుండి 12 నెలల జీతాలు బకాయిలో ఉన్నాయని తెలిపారు. దీనివల్ల కార్మికుల కుటుంబాలు పస్తులతో గడుపుతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే స్పందించి బకాయి జీతాలు చెల్లించేటట్లు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జిఒ 68 జారీ చేసి 3 ఏళ్లు గడుస్తున్నా దాని ప్రకారం జీతాలు ఎక్కడా అమలు చేయడం లేదని వాపోయారు. గ్రీన్‌ అంబాసిడర్లను పంచాయతీలకు అప్పజెపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, పంచాయతీల నుండి జీతాలు చెల్లించలేమని సర్పంచులు చెబుతున్నారని తెలిపారు. రూ.వెయ్యికి, రూ.1500కి పనిచేయాలని, లేకుంటే మానేయండని కొంతమంది సర్పంచులు చెబుతున్నారని, ఈ వైఖరి సరైనది కాదని అన్నారు. 680 జిఒ ప్రకారం జీతాలు చెల్లించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. నెలకు రూ.10 వేల జీతం ఇవ్వాలని, గ్రీన్‌ అంబాసిడర్లకు మాస్కులు, శానిటేజర్‌, యూనిఫాం, గుర్తింపుకార్డులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. రిక్షాల రిపేర్లు చేయించాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సూరిబాబు, పి.రాజశేఖర్‌, గ్రీన్‌ అంబాసిడర్లు హెచ్‌. రాజేంద్ర, పి. కూర్మయ్య, ఎం.పైడయ్య, ఎం.చంటి, జి.రాము, పి.తిరుపతిరావు, ఎం.కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️