బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి

Mar 26,2024 21:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  విజయనగరం కార్పొరేషన్‌ ప్రజానీకానికి తాగునీరు అందిస్తున్న ముషిడిపల్లి , రామతీర్థం నెల్లిమర్ల మాస్టర్‌ పంపుహౌస్‌ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) నాయకులు జగన్మోహన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 16న కమిషనర్‌ సమక్షంలో జరిగిన చర్చల్లో ఈనెల 18 మధ్యాహ్నం నాటికి రూ.2వేలు బకాయి జీతంతో పాటు అమృత పంపు హౌస్‌ కార్మికులకు సెప్టెంబర్‌ బకాయి జీతం చెల్లిస్తామని కాంట్రాక్ట్రర్‌ హామీ ఇచ్చారని, కానీ నేటికీ డబ్బులు చెల్లించలేదని అన్నారు. అమృత పంప్‌ హౌస్‌ కార్మికులకు 2022 మార్చి, ఏప్రిల్‌ జీతం బిల్లులు కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ధర్నా చేస్తామని చెప్పేసరికి 70 మందికి రూ.2వేలు చొప్పున అకౌంట్‌లో వేశారని తెలిపారు. 2023 జూలై నుంచి ప్రభుత్వం వద్ద బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, అవి వస్తే తప్ప జీతాలు చెల్లించలేమని కాంట్రాక్టర్‌ చేతులెత్తేస్తున్నారని తెలిపారు. 7 నెలలు గా జీతాలు లేక కుటుంబాలతో ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం, పాలకవర్గం ఇప్పటికైనా స్పందించి బకాయి జీతాలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో నిరవధిక నిరసన దీక్షలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం బకాయి జీతాలపై కమిషనర్‌ ఎంఎం నాయుడుతో చర్చించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి జీతాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నెల్లిమర్ల, ముషిడిపల్లి, రామతీర్థం పంపుహౌస్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️