బతుకు సమరంలో మరో ఇద్దరు బలి

Apr 1,2024 23:09

మాచర్ల వద్ద ప్రమాదంలో మృతి చెందిన నారాయణమ్మ
ప్రజాశక్తి – మాచర్ల, చిలకలూరిపేట :
ఏరోజుకారోజు కూలి పనులు చేసుకుంటే గాని పూట గడవని కూలీలు ఉపాధి వేటకు వెళ్తూ ప్రమాదాలకు బలవుతున్నారు. తాజాగా మాచర్ల, చిలకలూరిపేట పట్టణాలకు సమీపంలో వాటిల్లిన ప్రమాదాల్లో ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. వివరాల ప్రకారం.. మాచర్ల పట్టణంలోని సెరీన్‌ కాలనీకి చెందిన 15 మంది వరకు మహిళా కూలీలు కొంతకాలంగా వెల్దుర్తి మండలం కళ్లకుంట గ్రామానికి మిర్చి కోతలకు ఆటోలో వెళ్తున్నారు. పట్టణ శివారు ప్రాంతం మండాది బోడుపై అడవి పంది అడ్డుగా రావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలోని నారోజు నారాయణమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందగా మహంకాళి నాగేంద్రమ్మ, చల్ల విజయ, బుజ్జి, మున్ని, డ్రైవర్‌ దాసుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా భర్త నాలుగేళ్ల కిందటే మరణించాడు. ఒక కుమారుడు, కుమార్తెకు వివాహాలయ్యాయి. కుమారులిద్దరూ హైదరాబాద్‌లో చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటుండగా నారాయణమ్మ ఒక్కరే ఉంటూ కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు.చిలకలూరిపేట పట్టణంలోని సంజీవ నగర్‌కు చెందిన మూకిరి కృపమ్మ (39), మరో ఆరుగురు మహిళా కూలీలు మిర్చి కోతల కోసం మండలంలోని కట్టుబడివారిపాలేనికి మిర్చి కోతలకు వెళ్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలప్పుడు వీరు ట్రాక్టర్‌లో వెళ్తుండగా పట్టణ శివారు టిడ్కో ఇళ్ల సమీపంలోని రహదారిపై గుంతల్లో పడిన ట్రక్కు పెద్ద కుదుపునకు గురవడంతో ట్రాక్టర్‌ నుండి కింద పడిన కృపమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను పట్టణంలోని ఒ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడివారు చెప్పడంతో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జనసేన నియోజకవర్గం సమన్వయకర్త టి.రాజారమేష్‌ సందర్శించి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు సమీపంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 9 మంది మృతి చెందారు. దుగ్గిరాలలో ఒ కార్పెంటర్‌ కూడా ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే.

➡️