బహుళ పంటల విధానంతో జీవ వైవిధ్యం అభివృద్ధి

Mar 8,2024 21:47

 ప్రజాశక్తి – పాచిపెంట : నేలను ఏడాది అంతా ఏదో ఒక పంటతో కప్పి ఉంచాలని, అలా చేసినప్పుడే భూమిలో జీవవైవిద్యం పెరిగి భూసార పరిరక్షణ జరుగుతుందని ప్రకృతి వ్యవసాయ రీజనల్‌ టెక్నికల్‌ లీడ్‌ ఆఫీసర్‌ కె.ప్రకాష్‌ అన్నారు. మండలంలోని సరాయివలస, పనుకువలసలో రైతులు కుమార్‌, సుకరమ్మ వేసిన ఎటిఎం పద్ధతి కూరగాయలను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ వేసవిలో సాగుభూమి ఏ పంట లేకుండా ఉన్నట్లయితే విపరీతమైన ఎండకు భూమిలో ఉన్న పోషకాలు నశించి సేంద్రియ పదార్థం శాతం తగ్గి భూసారం క్షీణిస్తుందన్నారు. కావున ఏదో ఒక పంటతో భూమిని ఏడాది పొడవునా కప్పి ఉంచాలని తెలిపారు. అంతేకాక ఏకపంట విధానం కంటే బహుళ పంటలు పండించినట్లయితే భూమి లోపల, జీవావరణంలో జీవ వైవిధ్యం పెరుగుతుందని తెలిపారు. మిత్ర పురుగుల సంఖ్య అధికమవుతుందని, భూమి లోపల ఉపయోగపడే సూక్ష్మజీవులు సంఖ్య కోటానుకోట్లుగా వృద్ధి చెందుతుందని రైతుకు కూడా పలుపంటల విధానం వల్ల అధిక ఆదాయం వస్తుందని తెలిపారు. కావున రైతులు విత్తన గుళికలు తయారు చేసుకుని ప్రస్తుతం ఉన్న పంట పూర్తి కాగానే డ్రై సోయింగ్‌ పద్ధతిలో భూమిలో తేమ లేకపోయినప్పటికీ విత్తనాలు చల్లుకునే విధానాన్ని రైతులకు తెలియజేయాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డివిజనల్‌ యాంకర్‌ యశోదమ్మ, రైతులు పాల్గొన్నారు.

➡️