బాధితులకు న్యాయం చేస్తాం: ఆర్‌డిఒ

ప్రజాశక్తి – కొత్తవలస: విశాఖపట్నం టు అరకు నేషనల్‌ హైవే రోడ్‌ 516 బాధితులకు సత్వర న్యాయం చేస్తామని విజయనగరం ఆర్‌డిఒ ఎం.వి సూర్యకుమారి తెలిపారు. స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో శుక్రవారం నేషనల్‌ హైవే రోడ్‌ బాధితులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేషనల్‌ హైవేకి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ విషయంలో భూమిలిచ్చిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మండలంలో సుమారు 9 గ్రామాల ప్రజలు నేషనల్‌ హైవే నెంబర్‌ 516 బిలో భూములు కోల్పోతున్నారని వారి సమస్యలు పరిష్కరించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ సభల్లో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. కొంతమంది ఇచ్చే నష్టపరిహారం పెంచమని, మరి కొంతమంది భూమి ఎక్కువగా కోల్పోతున్నామని, ఇంకొంతమంది సర్వేలో లోపాలు ఉన్నాయని ఆ సర్వే వల్ల గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువగా కోల్పోతున్నామని తెలిపినట్లు ఆర్‌డిఒ తెలిపారు. పూర్వం ఇచ్చిన డిపిఆర్‌నే అమలు చేయాలని కోరారని రైతులు కోరిన సమస్యలపై పై అధికారులకు నివేదికలు పంపించి రైతులకు మేలు జరిగే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తహశీ ల్దార్‌ శ్రీనివాస్‌మిశ్రా, రెవెన్యూ కార్యాలయ సిబ్బందితోపాటు 9 గ్రామాల ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

➡️