బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అందరీ బాధ్యత

Jan 26,2024 21:59
ఫొటో : మాట్లాడుతున్న కావలి అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ నరహరి హరిబాబు

ఫొటో : మాట్లాడుతున్న కావలి అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ నరహరి హరిబాబు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అందరీ బాధ్యత
ప్రజాశక్తి-కావలి : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అందరీ బాధ్యత అని, బాలలకు స్వేచ్ఛ, వికాసం కల్పించాలని, వెట్టి చాకిరీ ఇది ఒక సాంఘిక దురాచారంగా జరుగుతుందని కావలి అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ నరహరి హరిబాబు అన్నారు. బుడంగుంటలో కావలి సోషల్‌ రిఫార్మర్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం వెట్టి చాకిరీ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ నరహరి హరిబాబు మాట్లాడుతూ బాల కార్మికులు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నారని ముఖ్యంగా అసంఘటిత ఆర్థిక వ్యవస్థలలోని వివిధ రంగాల్లో పని చేస్తున్నట్టు తెలుస్తుందన్నారు. అధికారులు సమన్వయంతో బృందాలుగా ఏర్పడి తప్పిపోయిన బాల బాలికలను గుర్తించడం, పరిశ్రమలు, బ్రిక్స్‌ తయారీ, హౌటల్స్‌, లాడ్జి, మినరల్‌ వాటర్‌ సప్లరు, దుకాణాలు, దాబాలు ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టిచాకిరీకి గురైతే అలాంటి వారిని గుర్తించి సంబంధిత దుకాణాలపై కేసులు నమోదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అడ్వకేట్‌ సాయి ప్రసాద్‌ మాట్లాడుతూ బాల కార్మికుల సమస్య మానవ హక్కుల సమస్య మరియు అభివృద్ధి సమస్యగా మారిందని నిరాదరణకు గురైనా, తప్పిపోయిన పిల్లలు ఉన్నా, వెట్టి చాకిరీకి గురవుతున్నా పిల్లలు ఉన్న పోలీసులకు లేదా చైల్డ్‌ కేర్‌ వారికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కావలి సోషల్‌ రిఫార్మర్స్‌ అధ్యక్షులు చేవూరు చిన్న మాట్లాడుతూ ఇప్పటికీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాలకార్మిక వ్యవస్థ ఒకటని, కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారని, పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లేనని ప్రతిఒక్కరూ బాధ్యతతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కావలి సోషల్‌ రిఫార్మర్స్‌ కార్యదర్శి దిలీప్‌ కుమార్‌ రాయపాటి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని చిన్నారులే దేశ ప్రగతికి సోపానాలని కానీ అభివద్ధిలో పరుగులు పెడుతున్న నేటి హైటెక్‌ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరీ వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌ కళాశాల ప్రొఫెసర్‌ కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ బాల కార్మికుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పిల్లలు ప్రమాదకరమైన, అనారోగ్య పరిస్థితులలో తరచుగా చాలా గంటలు పనిచేయడం వల్ల శాశ్వత శారీరక, మానసిక హాని కలుగుతుందని, బంగారు భవిష్యత్తుకు పునాదిపడే దశ బాల్య దశ, ఇలాంటి కీలక దశలో బాలలను చదువు, ఆటలకు దూరంచేసి, శ్రామిక యంత్రాలుగా మార్చటాన్ని బాలకార్మిక వ్యవస్థగా చెప్పొచ్చన్నారు. బాలలను కార్మికులుగా మార్చే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. కావలి సోషల్‌ రిఫార్మర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బాల శైలజ మాట్లాడుతూ ఎవరైతే 6-14 సంవత్సరాల వయస్సు వర్గపు బాలలు పాఠశాలకు వెల్లటం లేదో వారందరు సంభావ్య బాల కార్మికులుగా భావించడం జరుగుతుందని, బంగారు భవిష్యత్తుకు పునాది పడే దశ బాల్య దశ. ఇలాంటి కీలక దశలో బాలలను చదువు, ఆటలకు దూరం చేసి, శ్రామిక యంత్రాలుగా మారుస్తున్నారని బాలలను కార్మికులుగా మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు. అనంతరం వెట్టి చాకిరి, బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనపై పోస్టర్‌ ఆవిష్కరించారు.

➡️