బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమాన విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.సీతారామకృష్ణారావు సోమవారం తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. గుంటూరు శివారు నల్లపాడులోని ఒక కాలనీకి చెందిన కొండా దినేష్‌ భార్య నుండి విడిపోయి తల్లితో ఉంటున్నాడు. 2022 సెంప్టెంబర్‌ 10న సాయంత్రం కాలనీలో తన ఇంటి ముందు ఆటలాడుకుంటున్న ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి, ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక కోసం వెతుకుతున్న తల్లితోపాటు, ఇతరులు ఆ బాలిక దినేష్‌ ఇంటి నుండి బయటకు రావటం గమనించారు. వెంటనే ఆ బాలికను పరీక్షించగా ఒంటిపై గాయాలున్నాయి. దినేష్‌పై నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అత న్ని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ఛార్జిషీటు దాఖలు చేశారు. నేరాన్ని ప్రాసిక్యూషన్‌ రుజువు చేయటంతో దినేష్‌కు 20 ఏళ్ల జైలు, రూ.3500 జరిమాన విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బాలికకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.శ్యామల ప్రాసిక్యూషన్‌ నిర్వహించగా, డీఎస్పీ జెస్సీ ప్రశాంతి దర్యాప్తు చేశారు.

➡️