బిల్లులు బిగ్గట్టి..!

Mar 9,2024 23:19

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు త్వరలో విడుదల కానుండటంతో ప్రభుత్వ శాఖలకు రావాల్సిన నిధులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. ప్రధానంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు చేసిన పనులకు పలు శాఖల్లో దాదాపు 9 నెలలకుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ పరిపాలనశాఖ, మార్కెటింగ్‌, గ్రామపంచాయతీల్లో చేసిన పనులతో పాటు నేరుగా ప్రభుత్వం వివిధ పద్దుల కేటాయించిన పనులకు బిల్లులు ప్రభుత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిధులు సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా సంబంధిత కాంట్రాక్టు సంస్థలకు, కాంట్రాక్టర్లుకు రావాల్సి ఉంది. సిఎఫ్‌ఎంఎస్‌లో నిధులు విడుదలలో తీవ్ర జాప్యమవుతోంది. జిల్లా మొత్తం మీద వివిధ శాఖలు సిఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసిన బిల్లులు కూడా రావడం లేదని చెబుతున్నారు. దాదాపు రూ.250 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. ఎన్నికల షెడ్యూలు విడుదల తరువాత ప్రభుత్వానికి అధికారం ఉండదు. దీంతో అత్యవసరమైన బిల్లులు మినహా రానున్న మూడునెలల్లో వివిధ శాఖలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండే అవకాశంఉంది. అంతేగాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చే వరకు బిల్లులు క్లియర్‌ అయ్యే అవకాశం లేకపోవడంతో కొన్ని శాఖల్లో రెండునెలలుగా ఎక్కువ మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయడంలేదు. సహజంగా వేసవిలో రహదారుల, భవనాల శాఖ, పంచాయతీరాజ్‌, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో భారీగా పనులు జరుగుతుంటాయి. కానీ ఈసారి ఎన్నికల నేపథ్యంలో పనులు నిర్వహించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 2019లో కూడా గత ప్రభుత్వం ఇలాగే ఎన్నికల ముందు కోట్లాది రూపాయిల బిల్లులు పెండింగ్‌లోపెట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నిధుల విడుదలకు తీవ్ర జాప్యం చేసింది. దీంతో కాంట్రాక్టర్లు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు కూడా ఎన్నికలపైనే దృష్టి సారించడం వల్ల వేసవిలో చేయాల్సిన పనులపై ఇంత వరకు కార్యాచరణ రూపొందించ లేదు. అంతేగాక గతేడాది నిర్వహించిన పనులకు ఇంత వరకు బిల్లులు రాకపోవడంతో ఆయాశాఖలు కూడా కొత్తపనులను పట్టించుకోవడం లేదు. ప్రధానంగా నీటిపారుదల శాఖలో వేసవిలో చేపట్టాల్సిన మరమ్మతులపై కార్యాచరణ ప్రకటించలేదు. గతేడాది కూడా పనులు ఆలస్యంగా చేపట్టడం వల్ల చివరి భూములు నీరందక, ఎగువ భూముల్లో నీరు పారక ముంపు సమస్యలు ఏర్పడి ఖరీఫ్‌లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభివృద్ధి పనులతో పాలనా పరంగా నిర్వహించేపనులకు సంబంధించిన బిల్లులకు కూడా నిధులు రావడంలేదు. నిధుల ఇవ్వకపోవడం వల్ల గుంటూరు ఛానల్‌ విస్తరణ, పొడిగింపు, వరికపూడి శెల ఎత్తిపోతల వంటి కీలకమైన పథకాలు గత ఐదేళ్లలో ఏమాత్రమూ ముందుకు పడలేదు. కొంత కాలంగా గుంటూరులో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. రూ.168 కోట్ల అంచనాలతో కూరగాయల మార్కెట్‌ స్థలంలో బహుళ అంతస్తుల సముదాయం నిర్మించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. శంకర్‌ విలాస్‌ వద్ద ఆర్వోబి విస్తరణ, పొడిగింపు, నగరంలో నిలిచిపోయిన భూగర్భ డ్రైనేజి పనుల పునరుద్ధరణ, శ్యామలానగర్‌, సంజీవనగర్‌ ఆర్‌యూబి తదితర పనులు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఎన్నికలు షెడ్యూలు రానుండటంతో ఈ పనులకు ఎప్పటికి మోక్షం లభిస్తుందనేది ప్రశ్నార్థకమైంది.

➡️