బీసీల అభివృద్ధి టిడిపితోనే సాధ్యం

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: బీసీల అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. శనివారం పెద్దదోర్నాలలోని శివసదన్‌లో టిడిపి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నూకసాని బాలాజీ మాట్లాడుతూ బీసీల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్‌రెడ్డి బీసీలను అభివృద్ధి చేయకుండా వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును అధికారంలోకి తెచ్చుకుంటే మహిళలకు చేయూతనివ్వడంతో పాటు రైతాంగానికి, నిరుద్యోగులకు బాసటగా నిలుస్తారని చెప్పారు. బాబు ష్యూరిటీతోనే రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు. పేరుకు బీసీ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ఒక్క పైసా కూడా నిధులు విధించని ప్రభుత్వం ఉందంటే అది కేవలం జగన్‌రెడ్డి ప్రభుత్వమేనని చెప్పారు. ప్రతి ఒక్క వర్గాన్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డిని ఇంటికి సాగనంపకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. టిడిపి యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఎన్నికలలోపు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీరు ఇవ్వగలరా అంటూ సవాల్‌ విసిరారు. పటిష్టంగా చేయాల్సిన పనులను తూతూమంత్రంగా చేసి ప్రాజెక్టును పూర్తి చేశామని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీసీలచే టిడిపి పుట్టిందన్నారు. ప్రజలు టిడిపిని ఆదరిస్తున్నారని చెప్పారు. గత టిడిపి పాలనలో విదేశీ విద్యలాంటి ఎన్నో పథకాలుంటే వాటన్నంటినీ ఈ ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ముందుగా వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం నుంచి శివ సదన్‌ వరకు డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, కొండపి నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు, టిడిపి బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు నందికనుము బ్రహ్మయ్య, రాష్ట్ర వాల్మీకి సమితి సభ్యులు నల్లబోతుల రమాదేవి, జనసేన మండల అధ్యక్షుడు మురళి, టిడిపి మండల కన్వీనర్‌ ఏరువ మల్లికార్జునరెడ్డి, నాయకులు అంబటి వీరారెడ్డి, భట్టు సుధాకర్‌రెడ్డి, పిచ్చయ్య, షేక్‌ మాబు, సుబ్బరత్నం, గుమ్మా గంగరాజు, దొడ్డా శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

➡️